Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యోమగాముల్ని వెనక్కి తీసుకొచ్చే టెస్ట్ వెహికల్స్‌పై
- పరీక్షలు : ఇస్రో ఛైర్మెన్ ఎస్.సోమనాథ్
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపడుతున్న 'గగన్‌యాన్' ప్రాజెక్ట్ కీలక దశకు చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్, డిసెంబర్లలో రెండు మానవ రహిత అంతరిక్ష ప్రయోగాలు జరపబోతున్నామని ఇస్రో ఛైర్మెన్ ఎస్.సోమనాథ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. అంతరిక్షంలోకి మానవులను పంపే సత్తా కొన్నిదేశాలకే ఉంది. ఈ రంగంలో భారత్ తన సత్తా చాటేందుకు, అలాగే రోదసిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు భారత్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గగన్‌యాన్'. ఈ ప్రాజెక్ట్ కింద మొట్టమొదటిసారిగా మానవసహిత యాత్రలకు తెరలేపింది.
2024లో మానవుల్ని అంతరిక్షంలోకి సురక్షితంగా తీసుకెళ్లే లక్ష్యంలో భాగంగా, ఈ ఏడాది మానవరహిత ప్రయోగాలు జరపబోతోంది. ఒకవేళ ప్రయోగం విఫలమయ్యే పరిస్థితి ఉంటే..వ్యోమగాముల్ని, ఇతర సిబ్బందిని సురక్షితంగా భూమిమీదకు చేర్చే 'అబోర్ట్ మిషన్'ను పరీక్షించబోతున్నామని ఛైర్మెన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ దేశ సామర్థ్యాన్ని ప్రదర్శించటమే 'గగన్‌యాన్' ప్రాజెక్ట్ లక్ష్యమని చెప్పారు.
ఆయన ఏమన్నారంటే...''గగన్‌యాన్‌లో వ్యోమగాముల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. కాబట్టి మేం 'అబోర్ట్ మిషన్స్'పై దృష్టి సారించాం. ప్రయోగం విఫలమయ్యే పరిస్థితి ఉంటే ఈ మిషన్‌ను మొదలుపెడతాం. సురక్షితంగా వ్యోమగాముల్ని భూమి మీదకి చేర్చుతాం. దీనికి సంబంధించి టెస్ట్ వెహికల్ ప్రయోగం సెప్టెంబర్‌లో ఉంటుంది. హ్యూమన్ క్యాప్సూల్‌ను 15 కి.మీ ఎత్తు వరకూ పంపి..అక్కడ్నుంచి అబోర్ట్ మిషన్ చేపడతాం. ఆ క్యాప్సుల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగేట్టు ఏర్పాట్లుచేస్తా''మని అన్నారు. రెండో టెస్ట్ వెహికల్ ప్రయోగం డిసెంబర్లో చేపడతున్నామని అన్నారు. మొదటి ప్రయోగంలో కన్నా మరింత ఎత్తుకు క్యాప్సుల్‌ను తీసుకెళ్లి..సురక్షితంగా కిందకు తీసుకురావటమే దీంట్లో లక్ష్యమని అన్నారు.