Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మోటార్ వెహికిల్స్ యాక్ట్ కొత్త సవరణల ప్రకారం.. టూ వీలర్స్‌కు హెల్మెట్ నిబంధనలను కేంద్రం మరింత కఠినతరం చేసింది. నాణ్యతా ప్రమాణాలు లేని హెల్మెట్లు ధరించినా జరిమానా తప్పదని తెలిపింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఎస్ఐ) సర్టిఫికేషన్, ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లపై తప్పనిసరిగా ఉండాల్సిందే. లేకుంటే.. మోటర్ వెహికిల్స్ యాక్ట్ 1988లోని సెక్షన్ 129 ఉల్లంఘనల కింద సెక్షన్-194డీ ప్రకారం.. వెయ్యి రూపాయల జరిమానా, మూడు నెలల పాటు లైసెన్స్‌ను రద్దు చేయనుంది. టూవీలర్స్ ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను మాత్రమే ఉపయోగించాలంటూ గతేడాది జూన్‌లో ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ చాలామంది ఐఎస్ఐ బ్రాండ్ కాని హెల్మెట్లనే వినియోగిస్తున్నారు. ఇకపై ఐఎస్ఐ మార్క్, బీఎస్ఐ సర్టిఫికేషన్ లేని హెల్మెట్ గనుక ఉపయోగిస్తే.. వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నది. అలాగే బైక్‌పై వెళుతున్నప్పుడు హెల్మెట్ బకెల్, బ్యాండ్ సరిగా పెట్టుకోకున్నా రూ. వెయ్యి జరిమానా తప్పదని తెలిపింది. హెల్మెట్ సక్రమంగా ధరించినా.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, రెడ్ లైట్ జంపింగ్ చేయడం లాంటి వాటికి కూడా రూ.2 వేలు జరిమానా తప్పదు. ఒక్కోసారి జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయనుంది.