Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదొక సంక్లిష్టమైన.. సున్నితమైన సమస్య : సుప్రీంకోర్టు
- మే 17నాటి మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని వెల్లడి
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జ్ఞానవాపి మసీదు కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈకేసును వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తున్నట్టు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ న్యాయ విభాగానికి సంబంధించి సీనియర్, అనుభవజ్ఞులైన జ్యుడీషియల్ అధికారి ఈకేసును విచారించాలని సుప్రీం ఆదేశించింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ నుంచి కేసును వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేసినట్టు జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది. జ్ఞానవాపి మసీదు వీడియోగ్రాఫీ సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీంలో శుక్రవారం విచారణ వాడివేడీగా సాగింది. ఈతరుణంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అనే సస్పెన్స్ వీడింది. జిల్లా కోర్టులోనే విచారణకు మొగ్గు చూపిన త్రిసభ్య ధర్మాసనం..ఇదొక సంక్లిష్టమైన, సున్నితమైన అంశమని పేర్కొన్నది.
జిల్లా కోర్టు నిర్ణయం, విచారణపై స్టే విధించాలంటూ పిటిషనర్ (అంజుమాన్ ఇంతెజమీయా మసీద్ కమిటీ) తరఫు న్యాయవాది బెంచ్‌ను కోరారు. అయితే ఈ కేసు పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ శివలింగాన్ని సంరక్షించడంతోపాటు నమాజ్ కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అంతేకాదు ట్రయల్ జడ్జి కంటే అనుభవం ఉన్న జిల్లా జడ్జి సమక్షంలోనే వాదనలు జరగటం మంచిదని పేర్కొన్నది. ఈమేరకు పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది.
మరోవైపు అడ్వొకేట్ కమిషన్ రూపొందించిన రిపోర్ట్, బయటకు పొక్కడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ప్రత్యేకించి కొన్ని లీకులు మీడియాకు చేరుతున్నాయి. అది కోర్టుకు సమర్పించే అంశం. కోర్టులో జడ్డే కదా దానిని తెరవాల్సింది..అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. రెండు వర్గాల మధ్య సౌభ్రాతృత్వం, శాంతి నెలకొల్పాల్సిన అవసరముందని అన్నారు. దాంతో మే 23న వారణాసి కోర్టు మసీదు సర్వే పిటిషన్‌పై వాదనలు వినేందుకు మార్గం సుగమమైంది.