Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూహెచ్ఓ గణాంకాలను వ్యతిరేకించలేదు
- కోవిడ్-19 మరణాలపై నిపుణులు
న్యూఢిల్లీ : కోవిడ్-19 మరణాలు విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనాలను భారత్ ఇటీవల తిరస్కరించింది. సంస్థ అనుసరించిన పద్దతిపై అభ్యంతరాలను లేవనెత్తింది. డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం.. 2021 చివరి నాటికి అధికారికంగా 4,80,000 మరణాలు సంభవించగా, భారత్‌లో కోవిడ్-19 మరణాలు 40.74 లక్షలుగా ఉన్నాయి. అధికారికంగా నమోదు చేయబడిన మరణాల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ అభ్యంతరాలు చాలా వరకు ఆమోదయోగ్యం కావు. నిపుణులు, ఎపిడోమియాలజిస్టులు, జర్నలిస్టుల నుంచి వచ్చి వివిధ అంచనాలను బట్టి భారత్‌లో భారీ కోవిడ్-19 మరణాల సంఖ్యను, అధికారిక అంచనాలలో తక్కువగా నివేదించబడ్డాయి. కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వాదిస్తూనే ఉన్నది. భారత్ వైఖరిపై నిపుణులు ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. 2021లో డెల్టా వేరియంట్ భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసినప్పుడు కేసులు, సంబంధిత మరణాల సంఖ్య గణనీయంగా పెరగటంతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. గంగానదిలో తేలియాడుతున్న శవాల బాధాకరమైన దృశ్యాలు, ఢిల్లీతో సహా ప్రధాన నగరాల్లో ఒకేసారి అనేక ఫైర్లు కాలిపోవడం, ఆక్సిజన్, బెడ్ల కొరతతో 24 గంటల పాటు సాగిన శ్మశానవాటికల బయట పొడవైన క్యూలు మీడియాలో వచ్చిన విషయాన్ని నిపుణులు గుర్తు చేశారు.
ఇతరదేశాలు భారత్‌లో వింత ప్రకటనలు చేయలేదని నిపుణులు తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసినట్టుగా చాలా దేశాలు అధిక మరణాలు కలిగి ఉన్నాయని తేలింది. ఈ లెక్కల ప్రకారం.. పెరూ అత్యధిక మరణాల సంఖ్య నమోదు చేసింది. లక్ష జనాభాకు 1476 మరణాలు అక్కడ ఉన్నాయి. అదే విధంగా హంగరీ, పోలాండ్, యునైటెడ్ స్టేట్స్, ఇటలీ వంటి ఇతర అధిక ఆదాయ దేశాలలో లక్ష జనాభాకు వరుసగా 786, 674, 528, 494 మరణాలున్నాయి. 191 దేశాలలో భారత్ ఈ లెక్కల్లో లక్ష మంది జనాభాకు 375 మరణాలను కలిగి ఉండి 54వ స్థానంలో ఉన్నది.
భారత్ శాస్త్రీయ హేతుబద్ధత ఆధారంగా గణనతో ముందుకు రావాల్సిన సమయమిది అని నిపుణులు చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ గణాంకాలను విమర్శించి దానిని తిరస్కరించటం వంటిది పరిస్థితిని మరింత దిగజార్చుతుందని వివరించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సరైన ప్రజారోగ్య వ్యూహాలను భారత్ అనుసరించాల్సిన విషయాన్ని నొక్కి చెప్పారు.