Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14కు పెరిగిన మృతుల సంఖ్య
- 8లక్షల మందికిపైగా నిరాశ్రయులు
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రం అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరపి లేకుండా కురసిన వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దాంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. 29 జిల్లాల్లో దాదాపు 8లక్షల మందికి పైగా వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. జమునాముఖ్ జిల్లాలోని చాంగ్జురై, పటియా పాథర్ గ్రామాలు పూర్తిగా నీటమునగడంతో 500లకు పైగా కుటుంబాలు రైల్వే ట్రాక్‌లపై రోజులు గడుపుతున్నాయి. ఈరెండు గ్రామాలను వరదలు ముంచెత్తాయి. రైల్వే ట్రాక్ కాస్త ఎత్తులో ఉండటంతో అది వరద నీటిలో మునిగిపోలేదు. దాంతో ఈ గ్రామాలకు చెందిన కుటుంబాలు సర్వం కోల్పోయి ట్రాక్‌పై టార్పాలీన్ షీట్లతో గుడారాలు వేసుకుని ఉంటున్నారు. గత ఐదు రోజులుగా తమ పరిస్థితి ఉందని, తినడానికి తిండి కూడా దొరకట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ''మొదటి మూడు రోజులు గుడారాలు కూడా లేవు. ఆ తర్వాత మా దగ్గర ఉన్న డబ్బులతో టార్పాలిన్ షీట్లు తీసుకొచ్చుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారుల నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. తాగడానికి నీళ్లు లేవు. రోజుకు ఒక పూటే తింటున్నా''మని బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అసోంలో గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించాయి. జల విలయంతో కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి రోడ్డు మార్గాలు కొట్టుకుపోయాయి. అనేక చోట్ల రైల్వే ట్రాక్‌లు కూడా నీట మునగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక శాఖ బలగాలతోపాటు స్థానికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈఏడాది నైరుతి రుతుపవనాలు కూడా అనుకున్న సమయం కంటే ముందుగానే కేరళను తాకనున్నాయి. దాంతో కేరళ రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉంది. కర్నాటకలోనూ వర్షాలు కురుస్తున్నాయి.
బీహార్‌లో భారీ వర్షాలు
బీహార్‌ను ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల వృక్షాలు నేలకూలాయి. వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న వరద సంబంధిత ఘటనల్లో 27మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. వరదల ఘటనలపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 11 విమానాలను లక్నో, జైపూర్‌కు దారిమళ్లించారు. ఇందులో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణించిన విమానం కూడా ఉంది.