Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఒక వర్గం వ్యక్తి'గా భావించి దారుణానికి పాల్పడిన వైనం
- వీడియో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి
- బాధితుడు మానసిక వికలాంగుడు
- మధ్యప్రదేశ్లో ఘటన
భోపాల్ : బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకున్నది. 'ఒక వర్గానికి చెందిన వ్యక్తి'గా భావించి మానసిక వికలాంగుడైన ఒక వృద్ధుడిని (65) కొట్టి చంపాడు బీజేపీ నాయకుడు. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. బీజేపీ నాయకుడి దారుణాన్ని భయటపెట్టింది. ఈ ఘనటలో నిందితుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు దినేశ్ కుష్వాహా మనస మునిసిపల్ కార్పొరేషన్ వార్డు మాజీ కౌన్సిలర్, బీజేపీ నాయకురాలు బినా కుశ్వాహ భర్త. మృతుడు భవర్లాల్ జైన్ది రాట్లం జిల్లా సర్సీ గ్రామం. భవర్లాల్ తన కుటుంబంతో కలిసి ఈనెల 15న పొరుగు జిల్లా అయిన చిత్తోర్ఘర్లోని ఒక వివాహ వేడుకకు హాజరు కావడానికి వెళ్లాడు. అయితే, అక్కడ ఆయన కనిపించకుండా పోయాడు. రెండు రోజులైనా ఆచూకీ లభించకపోవటంతో బాధితుడి బంధువులు చిత్తోర్ఘర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు.
మనసర్ ప్రాంతానికి చెందిన రాంపుర రోడ్డు దగ్గర భవర్లాల్ చనిపోయి కనిపించాడు. తప్పిపోయినట్టు కేసు నమోదైన నాలుగు రోజుల తర్వాత ఆయన శవమై కనిపించాడు. మృతదేహాన్ని కనుగొన్న తర్వాత రోజు ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అందులో భవరల్లాల్ను దినేశ్ కుష్వాహ దాడి చేస్తున్నట్టు, ఆయన పేరును, ఆధార్ కార్డును చూపాలని బెదిరించినట్టు కనిపించింది. ఆ ప్రాంతంలోనే భవర్లాల్ మృతదేహాన్ని తర్వాతి రోజు ఉదయం పోలీసులు కనుగొన్నారు. కాగా, వైరలైన వీడియో భవర్లాల్ కుటుంబానికి చేరింది. దీంతో ఆయన సోదరుడిపై దాడికి దిగి కొట్టి చంపిన దినేశ్పై రాకేశ్ మనస పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
భవర్లాల్ జైన్ పొరపాటున ఈనెల 17, 18 మధ్య చిత్తోర్ఘర్ నుంచి మనసకు చేరుకున్నాడు. ఆ సమయంలో తన ఇళ్లు, కుటుంబ సభ్యుల కోసం ఆయన ఎదురు చూస్తున్న సమయంలో దినేశ్ తారసపడ్డాడు. ఒకవైపు రెండు రోజుల పాటు తిండిలేకపోవటం, మానసిక వికలాంగుడు కూడా అయిన భవర్లాల్.. దినేశ్ ప్రశ్నలకు స్పందించే స్థితిలో లేడు. ఈ సమయంలో భవర్లాల్ నోటి నుంచి 'ఒక వర్గానికి చెందిన పేరు' బయటకు రావటంతో దినేశ్ ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. సదరు వృద్ధుడు 'ఆ వర్గం' వ్యక్గిగా భావించి దినేశ్ ఆయనపై దాడికి దిగాడు.
పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారనీ, నిందితుడి కోసం గాలిస్తున్నామని నీమూచ్ ఎస్పీ సూరజ్ కుమార్ తెలిపారు. దినేశ్పై పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 302, 304(2) కింద కేసు నమోదు చేశారు. దినేశ్ మాత్రం పరారీలో ఉండటం అనుమానాలకు తావిస్తున్నది.