Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జల్పాయిగురి:చారిత్రాత్మక తెబాగా ఉద్యమ 75వ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పశ్చిమబెంగాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. జల్పాయిగురి బిదాన్ నగర్లో భారీ ర్యాలీ జరిగింది. శనివారం నిర్వహించిన ఈ ర్యాలీకి వేలాదిగా జనం తరలివచ్చారు. నాటి పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని ప్రతిన బూనారు. సిపిఎం పశ్చిమబెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌డి సలీమ్, ఎఐకెఎస్ రాష్ట్ర కార్యదర్శి అమల్ హాల్దర్, ఎఐకెఎస్ నేతలు ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు.
తెభాగ పోరాట విశిష్టత
1946 చివరిలో బెంగాల్ ప్రాంతీయ కిసాన్ సభ, భూమి దున్నే రైతుకు మూడింట రెండొంతులు పంట ఇవ్వాలనే డిమాండ్‌ను ముందుకుతెచ్చింది. ఈ అంశంపై బెంగాల్లో ఉవ్వెత్తున సాగిన పోరాటమే తెబాగా ఉద్యమం. సాధారణంగా భూస్వామి, భూమి దున్నుకునే రైతు సగం సగం పంచుకునే వారు. పంట వేసేందుకు మదుపుగానో, అధిక వడ్డీలనో, కరువు కాలంలో ఇచ్చిన తిండి గింజల గానో లెక్కలు చూపి పంట తగ్గించి ఇవ్వడంతో, రైతు ఎప్పుడూ నిరుపేదగా భూస్వామి దయాదాక్షిణ్యాలపై బతకాల్సి వచ్చేది. ఈ దోపిడీపై రైతు వ్యతిరేకత ఫలితంగా వచ్చిందే తెబాగా ఉద్యమం. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు 1947జనవరి, ఫిబ్రవరి నెలల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో హిందూ, ముస్లిం, గిరిజన వర్గాలకు చెందిన 70 మంది రైతులు ప్రాణత్యాగం చేశారు. ఎక్కువ మంది పోలీస్ కాల్పుల్లోనే అసువులు బాయగా,నలుగురు జైలులో మరణించారు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ముస్లిం లీగ్ ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు క్రూర నిర్బంధాన్ని విధించింది.ఈ విషయంలో ముస్లిం లీగ్‌కు హిందూ భూస్వా ములు అండగా ఉన్నారు.ఇది వారి వర్గ స్వభావాన్ని తెలియజేస్తోంది.