Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రో ధరల తగ్గింపు నష్టాన్ని భర్తీ కోసం రుణ యత్నం
- పెట్రో పన్ను తగ్గింపు భారం మొత్తం కేంద్రమే భరిస్తోంది: నిర్మలా
న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఏర్పడిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అదనపు రుణం కోసం ప్రయత్నిస్తుంది. పెట్రో ధరలు తగ్గించడం వల్ల 1290 కోట్ల డాలర్లు (సుమారు రూ. లక్ష కోట్లకు పైగా ) ఆదాయాన్ని కోల్పోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), వ్యక్తిగత ఆదాయపు పన్ను ద్వారా వసూలైన సొమ్ము పేదలు, రైతులకు ఆహారం, ఎరువుల కోసం రాయితీలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, ఇటీవల తగ్గించిన ఎక్సైజ్ సుంకాల వల్ల ఖజానాకు రాబోతున్న నష్టాన్ని అదనపు రుణాల ద్వారా భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రుణ భారం పెరుగుతుండటంతో భారత దేశ బాండ్ మార్కెట్‌పై ప్రభావం పడుతుంది. గత నెలలో బెంచ్‌మార్క్ 10 ఇయర్ నోట్స్‌పై రాబడిలో పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వం శనివారం పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతోపాటు, కోకింగ్ కోల్‌పై దిగుమతి పన్నును తగ్గించింది. అదేవిధంగా ఎరువులపై రాయితీలను పెంచింది. అంతేకాకుండా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద పేదలకు అందిస్తున్న వంటగ్యాస్ సిలిండర్ ధరలో రాయితీని పెంచింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు తేవాలని ప్రణాళికను రచించడం, ధరల ఒత్తిళ్ళు పెరగడం వల్ల ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి.
పెట్రో పన్ను తగ్గింపు భారం మొత్తం కేంద్రమే భరిస్తోంది : నిర్మలా సీతారామన్
పెట్రో పన్ను తగ్గింపు భారం మొత్తం కేంద్రమే భరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శనివారం ప్రకటించిన పెట్రోల్, డీజిల్‌పై సుంకం తగ్గింపు మొత్తం పెట్రోలియం ఉత్పత్తులపై విధించే పన్నులలోని రోడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ (ఆర్ఐసీ) భాగానికి వెలుపల జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తెలిపారు. సుంకం తగ్గింపులు రాష్ట్రాలకు పన్నుల పంపిణీని తగ్గిస్తాయనే ఆందోళనలను పడొద్దని అన్నారు. పెట్రో ఉత్పత్తులపై ప్రాథమిక ఎక్సైజ్ సుంకాన్ని తాకలేదని ఆమె అన్నారు. ఇది రాష్ట్రాలతో పంచుకోదగినదని తెలిపారు.
పెట్రోలియం సుంకాల వాటా ద్వారా రాష్ట్రాలకు చాలా తక్కువ లభిస్తున్నందున, రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారుతుందని మాజీ ఆర్థిక, హౌం వ్యవహారాల మంత్రి పి చిదంబరం అన్నారు. ''వారి ఆదాయం పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ నుంచి వస్తుంది. కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించకపోతే, వారికి ఎక్కువ గ్రాంట్లు ఇస్తే తప్ప వారు ఆ ఆదాయాన్ని వదులుకోగలరా?'' అని ఆయన పేర్కొన్నారు.
పెంచినప్పుడు రాష్ట్రాలకు తెలిపారా?
పళనివేల్ త్యాగ రాజన్ ( తమిళనాడు ఆర్థిక మంత్రి)
తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ స్పందిస్తూ 2014 తరువాత కేంద్ర పన్నులను పెట్రోలుపై లీటర్‌కు రూ.23 (250 శాతం), డీజిల్ పై దాదాపు రూ.29 (900 శాతం) పెంచుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలను అడగలేదని, రాష్ట్రాలకు తెలియజేయలేదని పేర్కొన్నారు. ''ఇప్పుడు కేంద్ర పెంపుదలలో 50 శాతం మాత్రమే వెనక్కి తీసుకున్నారు. తగ్గించాలని రాష్ట్రాలను అడుగుతున్నారు'' అని ఆయన ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఇది అన్యాయమని, అసమంజసమని అన్నారు.