Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా 120 కేసులు నమోదు : డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తున్న కరోనా మహమ్మారిని మరవకముందే మరొక కొత్త వైరస్ ప్రజలకు దడ పుట్టిస్తున్నది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను 'మంకీపాక్స్' వైరస్ కలవరపెడుతున్నది. బ్రిటన్లో వెలుగు చూసిన ఈ వైరస్.. నెమ్మదిగా ఇతర దేశాలకూ విస్తరిస్తున్నది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 120 కేసులు నమోదయ్యాయి. మరిన్ని కేసులు పరిశీలనలో ఉన్నాయి. దీంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది. బ్రిటన్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇక్కడ ప్రస్తుతం కేసుల సంఖ్య 20కి చేరుకున్నది. స్పెయిన్లో 23 కేసులు వచ్చాయి. బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లు ఈ జాబితాలో చేరిపోయాయి. మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయనీ, మంకీపాక్స్ కేసులు మరిన్ని వెలుగు చూసే అవకాశమున్నదని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తున్నది. ఎపిడెమియోలాజికల్ పరిశోధనలు కొనసాగుతున్నాయనీ, స్వలింగ సంపర్కులకే ఎక్కువగా ఈ వైరస్ సోకుతుందని తెలిపింది. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. దీంతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.