Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహార, ఇంధన ధరలతో బడా కార్పొరేట్లకు భారీ లాభాలు
- ప్రతి 30 గంటలకు ఒక శతకోటీశ్వరుడు పుట్టుకొస్తున్నాడు..
- మరోవైపు పేదలు, సామాన్యుల బతుకు ఆగమాగం : ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ నివేదిక
- పేదరిక నిర్మూలనకు జరిగిన కృషి నిష్ఫలమవుతోంది..
న్యూఢిల్లీ : కోవిడ్ సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పుడు అధిక ధరలు, ఇంధనం సమస్యతో ప్రపంచం సతమతమవుతోంది. మరోవైపు.. శతకోటీశ్వరులు (బిలియనీర్లు) చొక్కానలగకుండా కేవలం రెండు రోజుల వ్యవధిలో సుమారుగా 80వేల కోట్ల సంపదను ఆర్జిస్తున్నారు. ఆహార, ఇంధన రంగాల్లో బడా కార్పొరేట్ల ఆర్జన ఆకాశమే హద్దుగా సాగుతోంది. ఆహార, ఇంధన ధరలు ఎంతవేగంగా పెరుగుతున్నాయో..బడా కోటీశ్వరుల సంపద కూడా అంతే వేగంగా పెరుగుతోందని 'ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్' తాజా నివేదిక పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగిపోయాయని, కోవిడ్ మహమ్మారి మూలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 30గంటలకు ఒక శతకోటీశ్వరుడు పుట్టుకొచ్చినట్టు తెలిపింది. అదే సమయంలో ప్రతి 33 గంటలకు దాదాపు 10లక్షల మంది తీవ్రమైన పేదరికంలోకి జారుకున్నారని వివరించింది.
దావోస్ వేదికగా జరుగుతున్న 'ప్రపంచ ఆర్థిక వేదిక' వార్షిక సమావేశంలో 'ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్' పేరిట రూపొందించిన నివేదికను ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. దీంట్లో ఏముందంటే..గత దశాబ్దాలతో పోలిస్తే నిత్యావసరాల ధరలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. దాంతో ఆహారం, ఇంధన రంగాల్లో ఉన్న కార్పొరేట్ల సంపద ప్రతి రెండు రోజులకు ఒక బిలియన్ డాలర్ల (సుమారుగా రూ.80వేల కోట్లు) చొప్పున పెరిగింది. పేదరికాన్ని రూపుమాపడానికి దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. నిత్యావసరాల ధరలు పెరిగి పేదలు జీవనం సాగించడానికే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది.
పేదరికంలోకి 23.6కోట్లమంది
ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ చొప్పున కోవిడ్ సంక్షోభ సమయంలో 573మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారు. అలాగే ప్రతి 33 గంటలకు 10లక్షల మంది చొప్పున మొత్తం ఈ ఏడాది 23.6కోట్లమంది పేదరికంలోకి జారుకున్నారు. గత 23 సంవత్సరాల్లో పెరిగిన శతకోటీశ్వరుల సంపద కన్నా, కోవిడ్ సంక్షోభ సమయంలో (24నెలల్లో) వారు పోగేసుకున్న సంపద ఎక్కువగా ఉంది. ప్రస్తుతం శతకోటీశ్వర్ల సంపద ప్రపంచ జీడీపీలో 13.9శాతానికి చేరింది. ఇది 2000 ఏడాదిలో 4.4శాతంగా ఉండేది. అయితే ఈ పెరుగుదల శతకోటీశ్వర్ల నైపుణ్యాల వల్లనో లేక కష్టపడి పనిచేయడం వల్లనో పెరగలేదు.
వారికి లాభాలే లాభాలు
ఇంధనం, ఆహారం, ఔషధరంగంలోని వ్యాపారులు రికార్డుస్థాయిలో లాభాలు ఆర్జిస్తున్నారు. అదే సమయంలో అందులో పనిచేసే శ్రామికులు మాత్రం పెరుగుతున్న ధరల కారణంగా నిత్యావసర వస్తువులు కూడా కొనలేని స్థితికి చేరుకున్నారు.