Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే మంత్రికి కేరళ ఎంపీ బినోరు విజ్ఞప్తి
న్యూఢిల్లీ : రైళ్లలో వయో వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించాలని కేరళ సీపీఐ ఎంపీ బినోరు విశ్వమ్ కేంద్రాన్ని కోరారు. ఈమేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు ఆయన లేఖ రాశారు. కరోనా విజృంభణ సమయంలో రైళ్లలో సీనియర్ సిటిజన్ల ప్రయాణ టికెట్ల రుసుములో ఇచ్చే రాయితీలను కేంద్రం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కేరళ ఎంపీ లేఖ రాస్తూ..కరోనా వైరస్ పేరిట రైళ్లలో ఇచ్చే రాయితీలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది సీనియర్ సిటిజన్లపై పడిందన్నారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో రాయితీలను పునరుద్ధరించాలని సీనియర్ సిటిజన్లు పదే పదే డిమాండ్ చేస్తున్నా సమీక్షించడం లేదని ఎంపీ లేఖలో విమర్శించారు.
దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో సమర్థమైన రవాణాను అందించేలా భారతీయ రైల్వేలను స్థాపించిన ప్రాథమిక ఉద్దేశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కొన్నేండ్లుగా సీనియర్ సిటిజన్లతోపాటు దాదాపు 50కిపైగా కేటగిరీల ప్రజలు ప్రయాణాన్ని సరసమైనదిగా చేసేందుకు పలు రాయితీలు కల్పించారన్నారు. అయితే, కరోనా విజృంభణ నేపథ్యంలో రద్దు చేస్తున్నామని, దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాక కొనసాగిస్తామనే పరోక్ష సంకేతాలతో రాయితీలు నిలిపివేశారన్నారు. కరోనా పేరుతో కేంద్రం ఈ రాయితీలను శాశ్వతంగా ఎత్తివేసి దేశ ప్రజలకు నష్టం చేసిందని ఆరోపించారు.
2020-2022 మార్చి మధ్యకాలంలో 7కోట్లమందికి పైగా సీనియర్ సిటిజన్లు రైల్వే సేవలను ఉపయోగించడంతో ఈ రాయితీల ఉపసంహరణ ప్రభావం గణనీయంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు. అందువల్ల రైల్వేల్లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. అనేకమంది సీనియర్ సిటిజన్లు పూర్తి టిక్కెట్ రుసుము చెల్లించే పరిస్థితుల్లో లేరని, రాయితీ లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ జీవితంలో దేశానికి సేవచేసిన సీనియర్ సిటిజన్లంతా పదవీ విరమణ చేశాక గౌరవంగా ఉండేలా చూడటం ఎంతోముఖ్యమన్నారు.