Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : కరోనా వైరస్ వ్యాప్తి నేర్పిన పాఠాలతో వైద్య రంగంలో సమూల మార్పులు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొన్న సిఎం రెండోరోజు ఓపెన్ సెషన్లో వైద్య, ఆరోగ్య రంగ విస్తరణ గురించి మాట్లాడారు. స్విస్ ప్రతినిధి బృందంతోనూ, టెక్ మహీంద్రా సిఇఓ గుర్నానీ, డస్సాల్ట్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్టలైన్తో సిఎం చర్చించారు. ఓపెన్ సెషన్లో మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్య రంగంలో ఏర్పడిన విపత్కర పరిస్థితుల నుండి గుణపాఠం నేర్చుకోవాలని చెప్పారు. నివారణ, నియంత్రణ, చికిత్స విధానాల ప్రాముఖ్యతను అది తెలియచేసిందని అన్నారు. అవి సక్రమంగా అమలు జరగాలంటే సమగ్ర ఆరోగ్య వ్యవస్థను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఆ దిశలో కృషి జరగాలని అన్నారు. కోవిడ్ లాంటి విపతు వస్తే ఎదుర్కొనేందుకు బలీయమైన వైద్య వ్యవస్థను రూపొందించడమే మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ వైద్య సేవల విషయంలో వెనుకబడి ఉన్నామని చెప్పారు. 44 దఫాలు ఇంటింటి సర్వే నిర్వహించామని, దీని కోసం గ్రామంలో సచివాలయం, 50 ఇళ్లకు ఒక వాలంటీరును ఏర్పాటు చేశామని చెప్పారు. వీరితోపాటు 42 వేలమంది ఆశావర్కర్లు కూడా చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో ఆయుష్మాన్ భారత్ పథకం ఉందని, రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలుచేస్తున్నామని తెలిపారు. అనంతరం టెక్ మహీంద సిఇఓ గుర్నానితో చర్చించారు. గుర్నానీ మాట్లాడుతూ విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారని తెలిపారు. సిఎం ఆహ్వానం మేరకు ఆంధ్రా యూనివర్శిటీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. నైపుణ్యాలను పెంచేందుకు హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్య ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. డస్సాల్ట్ సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్టలైన్ మాట్లాడుతూ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై ఎపితో కలిసి పనిచేస్తామని వివరించారు. అనంతరం స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో మాట్లాడారు.