Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2030 నాటికి పరిస్థితి కఠినం
- ఆసియా, ఆఫ్రికాలోని పరిస్థితులు సమస్యను పరిష్కరించగలదు : తాజా అధ్యయనం
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు ప్రపంచంలోని ఆయా దేశాలను ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసింది. ఆర్థికంగానూ కోలుకోకుండా చేసింది. అయితే, ఇలాంటి తరుణంలో తాజా అధ్యయనం ఒకటి ఆందోళనకు గురి చేస్తున్నది. 2030 నాటికి ప్రపంచ ఆకలి తీవ్రం కానున్నదని సదరు అధ్యయనం హెచ్చరించింది. అయితే, ఆసియా, ఆఫ్రికా దేశాలలో పెరుగుతున్న ఆహార ఉత్పత్తి పరిస్థితులు ఈ సమస్యను పరిష్కరించగలదని వెల్లడించడం ఊరటనిస్తున్నది.
తాజా అధ్యయనం ప్రకారం.. 10 ప్రధాన పంటలలో కేవలం 29 శాతం మాత్రమే అవి ఉత్పత్తి చేయబడిన దేశాలలో నేరుగా ఆహారంగా తీసుకోవచ్చు. ఇది 1960 నాటి పరిస్థితులతో పోలిస్తే 22 శాతం తగ్గింది. ఈ సమయంలో ఇది 51 శాతంగా ఉన్నది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచ ఆకలిని అంతం చేయాలనే లక్ష్యం సాధించే అవకాశం ఉండదని హెచ్చరించింది. నేడు ప్రాసెసింగ్, ఎగుమతులు, పారిశ్రామిక అవసరాల కోసం పంట కోతలు పుంజుకుంటున్నాయి. 2030 నాటికి, ప్రాసెసింగ్, ఎగుమతి, పారిశ్రామిక వినియోగ పంటలు ప్రపంచవ్యాప్తంగా పండించిన పంటలలో 50 శాతం వాటాని కలిగి ఉంటాయని అంచనా. 48 దేశాలు తమ జనాభాకు ఆహారం ఇవ్వడానికి తమ సరిహద్దుల్లో తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయవు. వీటిలో చాలా దేశాలు ఉప సహారా ఆఫ్రికాలో ఉన్నాయి. ఇటు ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ వంటి ఆసియా దేశాలు, హైతీ వంటి కరేబియన్ దేశాలు కూడా ఉన్నాయి. చాలా మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్న దేశాలలో ఆహార పంటల ఉత్పాదకతను పెంచడానికి శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు కృషి చేశారు. అయితే, ఇప్పటి వరకు వచ్చిన లాభాలు మాత్రం సరిపోలేదు. అయితే, ప్రపంచ ఆకలిని పారదోలడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు మరింత శ్రద్ధతో పని చేయాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు సూచించారు.