Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో దళిత డ్రైవర్ మర్డర్ కేసులో అదుపులోకి..
- ఏపీలో దళిత డ్రైవర్ మర్డర్ కేసులో అదుపులోకి..
కాకినాడ : దళిత యువకుడు, కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదరు భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు ఎట్టకేలకు సోమవారం అరెస్టు చేశారు. కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈ మేరకు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం... ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద సుబ్రమణ్యం గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. సుబ్రమణ్యాన్ని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో అనంతబాబు తెలిపారు. కాకినాడ శ్రీరామ్‌నగర్ శంకర్ టవర్ వద్ద అనంతబాబు, సుబ్రహ్మణ్యం మధ్య ఆ రోజు ఘర్షణ జరిగింది. తోపులాటలో సుబ్రమణ్యం ఇనుప చువ్వలపై పడిపోయారు. ఐరన్ రాడ్ తగలడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో, సుబ్రమణ్యాన్ని కారు వెనుక సీట్లో పడుకోబెట్టి ఆస్పత్రికి అనంతబాబు తీసుకెళ్లారు. ఆ సమయంలో సుబ్రమణ్యం శ్వాస ఆగిపోయినట్టు గుర్తించారు. సుబ్రమణ్యం మృతి చెందాడని నిర్ధారించుకున్నారు. రోడ్డు ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించడానికి అనంతబాబు ప్రయత్నించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చేసేందుకు సుబ్రమణ్యం శరీరంపై గాయాలు చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు అనంతబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నాం. పూర్తి విషయాలు తదుపరి దర్యాప్తులో తెలుస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ నెల 20న అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. శవ పంచనామా అనంతరం 22న మధ్యాహ్నం రెండు గంటలకు 302, ఎస్సి, ఎస్టి అట్రాసిటీ సెక్షన్ల కింద చట్టం కేసు పెట్టామని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా కాకినాడ డీఎస్పీ వి.భీమారావును నియమించామన్నారు. ఈ కేసు దర్యాప్తులో మౌఖిక సాక్ష్యాలతోపాటు సాంకేతికపరమైన ఆధారాలు, ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ పరమైన సాక్ష్యాలను, నిందితుడిని విచారించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. వీటి ఆధారంగా ఎంఎల్‌సిని ప్రధాన నిందితునిగా గుర్తించి అరెస్టు చేశామని చెప్పారు. నిందితుడు అనంతబాబుకు కాకినాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. రిమాండ్ రిపోర్ట్‌తో కాకినాడ స్పెషల్ మొబైల్ జెఎఫ్‌సిఎం కోర్టు జడ్జి ముందు హాజరు పర్చారు. అనంతబాబు అరెస్టు నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎంఎల్‌సి అనంతబాబు అరెస్టు కోసం రాస్తారోకో
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణం అరెస్టు చేయాలంటూ కాకినాడ రూరల్ ఇంద్రపాలెం లాకుల వద్ద వామపక్షాలు, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రాస్తారోకో జరిగింది. ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నినదించారు. ఈ రాస్తారోకోను భగం చేసేందుకు పోలీసులు యత్నించారు. ఆందోళన నిర్వహిస్తున్న వారిని బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం వారిని విడుదల చేశారు.