Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర సీఎంలకు లేఖ రాస్తా
- రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్
నవతెలంగాణ - రాజస్థాన్
కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్)ను రద్దు చేయాలంటూ దేశంలోని ఇతర సీఎంలకు లేఖ రాస్తానంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. దేశంలోనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్‌ను పునరుద్ధరించిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పింఛన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో జైపూర్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులతో సోమవారం కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీపీయస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్, వివిధ రాష్ట్రాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాజస్థాన్ సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ సీపీఎస్ విధానం ప్రభుత్వానికి, ఉద్యోగులకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. కేవలం షేర్ మార్కెట్ ద్వారా పెట్టుబడిదారులకు లాభదాయకమని విమర్శించారు. దేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులు, ప్రభుత్వం నష్టపోతున్న విధానాన్ని లేఖ రూపంలో తెలియచేస్తానని వివరించారు. ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఇప్పటివరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసిన రాజస్థాన్ ఛత్తీస్గడ్ ప్రభుత్వాలు ఆర్టికల్ 309 ద్వారా రాష్ట్రాలకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి పాత పింఛన్ విధానం పునరుద్ధరణకు కావాల్సిన ఉత్తర్వులు ఇచ్చాయని చెప్పారు. తద్వారా ఉద్యోగుల సామాజిక భద్రత కల్పించబడిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సీపీఎస్ మహమ్మారిని తరలి కొట్టడానికి ఉన్న ఆయుధం 309 ఆర్టికల్ అని చెప్పారు. ఉద్యోగుల రిటైర్మెంట్ భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత అని అన్నారు. అనంతరం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. దేశంలోని 84 లక్షల సీపీఎస్ ఉద్యోగ కుటుంబాల తరఫున ఆయనకు కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీపీఎస్ యూనియన్ అధ్యక్షులు కోజారాం, ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్, ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.