Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్లో ఆశా వర్కర్లకు 'గ్లోబల్ హెల్త్ లీడర్స్' పురస్కారం
- సమాజానికి, ఆరోగ్యవ్యవస్థను కలిపే అనుసంధానకర్తలు : డబ్ల్యూహెచ్వో
న్యూఢిల్లీ : భారత్లో ఆశా వర్కర్ల సేవల్ని ప్రశంసిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ 'గ్లోబల్ హెల్త్ లీడర్స్' పురస్కారాన్ని అందజేసింది. సమాజానికి, ఆరోగ్యవ్యవస్థకు మధ్య అనుసంధానకర్తలుగా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, కుటుంబ నియంత్రణ, వ్యాక్సినేషన్, పోషకాహారం, హాస్పిటల్లో ప్రసవాలు..మొదలైనవాటిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని డబ్ల్యూహెచ్వో తెలిపింది. కోవిడ్ సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావటంలో వారు సేవలు ముఖ్య భూమిక వహించాయని పేర్కొన్నది.
''భారత్లో 10లక్షల మందికిపైగా ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఆరోగ్య వ్యవస్థలో కీలకమైన బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య సేవల్ని గ్రామీణ పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ వారు తమ విధుల్ని సమర్థవంతంగా నిర్వర్తించారు. హాస్పిటల్ ప్రసవాలు, ప్రసవానంతరం వైద్య సేవలు, వ్యాక్సినేషన్, పారిశుద్ధ్యం, పోషకాహారంపై అవగాహన...మొదలైన వాటిల్లో మెరుగైన ఫలితాలకు వీరే కారణం'' పురస్కారానికి ఎంపికచేస్తూ డబ్ల్యూహెచ్వో ఒక ప్రకటనలో తెలిపింది.
ఆశా వర్కర్లకు, ఎన్జీవో సంస్థ 'పార్టనర్స్ ఇన్ హెల్త్' సహ వ్యవస్థాపకుడు పాల్ ఫార్మర్, మానసిక ఆరోగ్యంపై పరిశోధన చేస్తున్న అహ్మద్ హాంకిర్, వాలీబాల్ క్రీడాకారుడు ఓలీవీరా వారెలా, ఆఫ్ఘనిస్తాన్లో పోలియో, కుష్టు నివారణ కార్యకర్తగా పనిచేస్తున్న యోహియో సాసాకవా...మొదలైనవారికి 'గ్లోబల్ హెల్త్ లీడర్స్' పురస్కారం దక్కింది. ప్రపంచం ఓవైపు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఆయా సంస్థలు, వ్యక్తులు ఆరోగ్య సేవల్లో అద్భుతమైన పాత్ర పోషించారని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం గేబ్రియాసస్ అన్నారు.