Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు
అమలాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా అమలాపురం రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అమలాపురం భగ్గుమంది. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు విధ్వంసం సష్టించారు. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ ఇండ్లకు నిప్పు పెట్టారు. అమలాపురం బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్ ఇంటిపై రాళ్ల దాడి చేసిన ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మంత్రి విశ్వరూప్ ఇంటిని వేలాదిగా చుట్టుముట్టిన ఆందోళనకారులు ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మంత్రి ఇంటివద్ద ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాన్ని కూడా తగలబెట్టారు. దాడికి ముందే మంత్రి కుటుంబ సభ్యులను పోలీసులు తరలించారు. మరోవైపు, అమలాపురంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోని ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అమలాపురంలో పరిస్థితులను ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు సమీక్షిస్తున్నారు. అక్కడికి అదనపు బలగాలు తరలిస్తున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరం, కాకినాడ, ప.గో, కష్ణా జిల్లాల నుంచి బలగాలను రప్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
దురదృష్టకరం : మంత్రి విశ్వరూప్
దీనిపై మంత్రి విశ్వరూప్ స్పందిస్తూ.. 'నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్ చేశాయి. అంబేద్కర్ పేరు పెట్టాలని జనసేన నిరసనలు కూడా చేసింది. అయితే ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లను సష్టిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు చేస్తున్న కుట్రలివి. జిల్లాకు అంబేడ్కర్ పేరును వ్యతిరేకించడం సరికాదు. ఆయన పేరు పెట్టడంపై అందరూ గర్వపడాలి. ప్రస్తుత సమయంలో అందరూ సంయమనం పాటించాలి' అని మంత్రి విశ్వరూప్ కోరారు.
ప్రేరేపించే శక్తులు ఉండొచ్చు : మంత్రి సజ్జల రామకష్ణారెడ్డి
జిల్లాల విభజన సందర్భంగా ఆ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని వినతులు వచ్చాయి. విస్తతంగా డిమాండ్ ఉండటంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ గతంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అంబేద్కర్ ఒక జాతీయ మహా నేత, భరత మాత ముద్దుబిడ్డ. దానికి దురుద్దేశాలు ప్రేరేపించే శక్తులు కూడా ఉండొచ్చని సజ్జల రామకష్ణారెడ్డి అన్నారు.
అంబేద్కర్ కోనసీమ పేరు వివాదాస్పదం చేయొద్దు : సీపీఐ(ఎం)
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేయొద్దని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ కోరింది. అంబేద్కర్ కోనసీమ పేరును వివాదాస్పదం చేస్తూ హింసాత్మక ఘటనలు జరగడాన్ని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాల పునర్విభజన సందర్భంగా అనేక జిల్లాలకు స్వాతంత్య్ర సమరయోధులు లేదా ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టారనీ, కోనసీమ జిల్లాకు తదనంతరం అంబేద్కర్ పేరును నామకరణం చేశారని పేర్కొన్నారు. బీజేపీ మినహా సీపీఐ(ఎం) సహా అన్ని రాజకీయ పార్టీలూ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని బల పర్చాయని తెలిపారు. దీనిపై కొన్ని స్వార్థపర శక్తులు ప్రజల్లో విద్వేషాలు రగిల్చి వివాదం చేయడాన్ని సీపీఐ(ఎం) ఖండిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని నివారించేందుకు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవ హరించి ఉండాల్సిందని తెలిపారు. అమలాపురంలో శాంతి సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.