Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరా భారాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొనండి
- ప్రజాసంఘాల పోరాటవేదిక పిలుపు
అమరావతి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలు, పన్నుల భారాలకు నిరసనగా వామపక్షాల పిలుపుమేరకు ఈ నెల 30 వతేదిన కలెక్టరేట్ల వద్ద జరగనున్న ధర్నాలను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చింది. వేదిక ఆధ్వర్యంలో 'అధిక ధరలు.. పన్నుల భారాలు'పై విజయవాడలోని ఎంబి విజ్ఞాన కంద్రంలో మంగళవారం చర్చా వేదిక జరిగింది. వేదిక నాయకులు వి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈ మేరకు తీర్మానం చేశారు. పోరాటవేదిక నాయకులు కె ఉమామహేశ్వర రావు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని చర్చావేదికలో పాల్గొన్న వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ధరా భారాలకు వ్యతిరేకంగా ఈనెల 26న పెట్రోల్ బంక్ల వద్ద ప్రచార ఆందోళన, జూన్ 1 నుండి 7 వరకు జిల్లాల్లో కలిసొచ్చే సంఘాలతో విస్తృతస్థాయి సదస్సులు నిర్వహణ, 13 నుండి 18 వరకు అన్ని నియోజకవర్గాల్లో రిలే దీక్షలు నిర్వహించాలని చర్చావేదిక నిర్ణయించింది.