Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి కేసులో అదుపులోకి
- క్యాబినెట్ నుంచి తొలగింపు
- ఆ రాష్ట్ర సీఎంకు కేజ్రీవాల్ ప్రశంసలు
చండీగఢ్ : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజరు సింగ్లాపై వేటువేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి తొలగించారు. తన శాఖకు సంబంధించిన కాంట్రాక్టుల్లో ఒకశాతం వాటా ఇవ్వాలని సింగ్లా డిమాండ్ చేసినట్టు బలమైన ఆధారాలు రావటంతో భగవంత్ మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ నుంచి తొలగించిన నిమిషాల వ్యవధిలోనే అవినీతి నిరోధక శాఖ విజరు సింగ్లాను అరెస్టుచేసింది. మంత్రి విజరు సింఘాల్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించినట్టు భగవంత్ మాన్ ప్రకటించారు. ''ఇటీవల నాకొక ఫిర్యాదు వచ్చింది. నా ప్రభుత్వంలోని ఓ మంత్రి ప్రతి టెండర్‌కు ఒకశాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారు. దానిని చాలా సీరియస్‌గా తీసుకున్నా. దీని గురించి ఎవరికీ తెలియలేదు, నేను కోరుకున్నట్లయితే, దానిని ఎవరికీ తెలియకుండా చేయొచ్చు. నాపై విశ్వాసం ఉంచిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్టవుతుంది. ఒక శాతం అవినీతిని కూడా సహించబోం. ప్రజలు ఎన్నో ఆశలతో ఆప్ ప్రభుత్వానికి ఓటు వేశారు. దానికి అనుగుణంగా జీవించాలి. విజరు సింగ్లాపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశా. అవినీతికి పాల్పడినట్టు ఆయన అంగీకరించారు కూడా' అని వీడియో సందేశంలో సీఎం భగవంత్ మాన్ తెలిపారు. కాగా, అవినీతి ఆరోపణలపై ఓ మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించి అరెస్టు చేయించడం దేశ చరిత్రలో ఇది రెండోసారి. 2015లో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరుడిపై అవినీతి ఆరోపణలు రావడంతో అతనిపై వేటువేశారు. తాజాగా భగవంత్ మాన్ నిర్ణయాన్ని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను చూసి గర్వపడుతున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.