Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులపై దాడిని ఖండించిన ఏపీ హోంమంత్రి తానేటి వనిత
అమరావతి : కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ ఆంబేద్కర్ పేరును వ్యతిరేకిస్తూ అమలాపురంలో ఆందోళనలు రేపి, శాంతిభద్రతలకు విఘాతం కల్పించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. ఘటనపై మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీల డిమాండ్ మేరకు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు మార్చామని తెలిపారు. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అటువంటి వ్యక్తి పేరును కొంత మంది ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పదం చేసేందుకు గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. గొడవలు చేసేవారిపై, వెనకుండి నడిపించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. 20 మందికి పైగా పోలీసులకు రాళ్లదాడిలో గాయాలయ్యాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్కూల్ బస్సులను ఆందోళనకారులు తగులబెట్టారని వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వారిపై తప్పకుండా కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు.
కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి: చంద్రబాబు నాయుడు
కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో ఘర్షణలు దురదృష్టకరమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సున్నితమైన అంశంలో హోంమంత్రి టిడిపిపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ పోలీసుల, ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని కోరారు.
మంత్రి ఇంటిపై దాడికి సిపిఐ ఖండన
కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి చేయడం, నిప్పు పెట్టడాన్ని సిపిఐ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తమ అభ్యర్థనను ఆందోళనకారులు శాంతియుతంగా ప్రభుత్వానికి తెలపాలని, ఇటువంటి దాడులకు పాల్పడడం సరికాదని పేర్కొన్నారు. ఇటువంటి దాడులు సామాజిక ప్రయోజనాలకు విఘాతాన్ని కలిగిస్తాయని తెలిపారు. దాడులకు తెగబడిన వారిని పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం : పవన్‌కల్యాణ్
అమలాపురంలో ఆందోళనకారులు సంయమనం పాటించాలని, ఘటనపై హోంమంత్రి చేసిన ప్రకటనలో జనసేన పేరును ప్రస్తావించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమలాపురంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలకవర్గం విఫలమైందని, వారి తప్పులను పాలనాపరమైన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి లేని సమస్యలను సృష్టిస్తున్నారన్నారు. వారి వైఫల్యాలను ఇతర పార్టీలకు ఆపాదిస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్నారు.
కుల దురహంకారానికి నిదర్శనం : కాంగ్రెస్
అమలాపురంలో జరిగిన ఘటన కుల దురహంకారానికి నిదర్శనమని పిసిసి అధ్యక్షులు ఎస్ శైలజానాథ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినందుకు ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని సూచించినా పట్టించుకోలేదన్నారు. అమలాపురంలో దాడులకు పాల్పడ్డ వారిపై తక్షణమే ఎస్సి, ఎస్టి అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ పేరును వివాదాస్పదం చేయడం హేయం:
కెవిపిఎస్, ఎపిడికెఎస్ రాష్ట్ర కమిటీలు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టవద్దంటూ ఆయన పేరును వివాదాస్పదం చేయడం హేయమైన చర్య అని, దీన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం (ఎపిడికెఎస్) తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అండ్ర మాల్యాద్రి, జి క్రాంతికుమార్ మంగళవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. స్వార్థపరశక్తులు, మనువాదులు, మతోన్మాదశక్తులు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అంబేద్కర్ పేరును వివాదాస్పదం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం, పోలీసుశాఖ అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితులను చక్కదిద్దాలని కోరారు.