Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత పెన్షన్ విధానమే కావాలి
- మంత్రుల కమిటీతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు
అమరావతి : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ (ఒపిఎస్)ను అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ అమలు చేస్తామని హామీ ఇస్తేనే మరోసారి ప్రభుత్వం పిలిచే చర్చలకు వస్తామని చెప్పాయి. సిపిఎస్ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంప్రదింపుల కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంగళవారం సచివాలయంలో సమావేశం నిర్వహించింది. ఈ కమిటీలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ అధికారులు పాల్గొన్నారు. ఒపిఎస్ పునరుద్ధరణలో న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయని సంఘాలకు మంత్రులు చెప్పారు. అధికారులు గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జిపిఎస్)పై వేసిన లెక్కల ఆధారంగా రిటైర్డ్‌మెంటు తరువాత 33 శాతం ఇవ్వగలమని తెలిపారు. జిపిఎస్ అమలులో మార్పులు, చేర్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. సిపిఎస్‌పై ఉద్యోగులకు నచ్చజెప్పాలని సంఘాల నాయకులకు సలహా ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మంచి అవకాశం ఇస్తున్నామని, దీనిని అంగీకరించాలని కోరారు. ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్ మాట్లాడుతూ.. 2100 సంవత్సరం నాటికి ప్రభుత్వానికి పెన్షన్ భారంగా మారుతుందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందని, పెన్షన్‌పై పెట్టే ఖర్చు పెరుగుతుందన్నారు. జిపిఎస్‌లో మినిమం గ్యారెంటీ ఇస్తామన్నారు. సిపిఎస్ స్థానంలో జిపిఎస్‌ను అంగీకరించబోమని సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. జిపిఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన లెక్కలు ఊహాగానమని వ్యతిరేకించారు. 2,100 సంవత్సరం నాటికి ప్రభుత్వ ఆదాయం పెరగదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. అప్పటికీ అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే ఉంటాయా అని నిలదీశారు. సిపిఎస్‌లో పిఎఫ్, గ్రాట్యూటీ ఉండదని, సిపిఎస్ డబ్బులను ప్రైవేట్ కంపెనీలో పెట్టారని, జిపిఎస్‌లో ఏం చేస్తారో స్పష్టత లేదన్నారు. చత్తీస్‌గఢ్, బీహార్ వంటి రాష్ట్రాలు రద్దు చేశాయని చెప్పారు. తాము జిపిఎస్ అమలుపైనే ఆలోచన చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సిపిఎస్ అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని, సామాజిక భద్రత కోణంలో చూడాలని యుటిఎఫ్ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి చంద్రశేఖర్ రెడ్డి, ఎపి ఎన్‌జిఒ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రసాద్, ఎస్‌టియు అధ్యక్షులు సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల ఆందోళన
ఒపిఎస్ అమలు చేయాలని ఉద్యోగులు సచివాలయంలో ఆందోళన నిర్వహించారు. సిపిఎస్, జిపిఎస్ వద్దంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఒపిఎస్‌పైనే చర్చించాలని కోరుతూ ఎన్‌జిఒ సంఘాల నాయకులకు పూలు అందించారు.