Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కపిల్ సిబల్ రాజీనామా
- ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు నామినేషన్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవలే పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జక్కర్ రాజీనామా, వెను వెంటనే గుజరాత్ యువ నేత హార్దిక్ పటేల్ ఆ పార్టీని వదిలిపెట్టడంతో సతమతమవుతున్న కాంగ్రెస్ కు తాజాగా భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.
ఆయన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సమక్షంలో బుధవారం రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో కపిల్ సిబల్ ఒకరు.తాను స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. దేశంలో స్వతంత్ర గళంగా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకునేవాడినని చెప్పారు. తాను స్వతంత్ర గళంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మీడియాకు తెలిపారు. ప్రతిపక్షంలో ఉంటూ ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంటులో స్వతంత్ర గళం ఉండటం చాలా అవసరమని చెప్పారు. ఓ స్వతంత్ర గళం మాట్లాడితే ఆ మాటలు ఏదైనా రాజకీయ పార్టీ నుంచి వచ్చినవి కాదని ప్రజలు విశ్వసిస్తారన్నారు. తనను అర్థం చేసుకున్న అఖిలేశ్ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. మే 16న తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేశాననీ, రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించానని తెలిపారు.