Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్ధి అంచనాలకు ఎజెన్సీల కోత
- మార్చి త్రైమాసికంలో 3శాతం దిగువనే : ఎస్బీఐ
- అధిక ధరలే కారణం : మూడీస్
- ఈ ఏడాది 7.3 శాతామే : ఎస్అండ్పీ
న్యూఢిల్లీ : భారత్‌లో ఆర్థిక మాంద్యం ముంచుకోస్తోందని అంతర్జాతీయ, జాతీయ కీలక ఎజెన్సీల విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో నెలకొన్న అధిక ధరలకు తోడు అంతర్జాతీయ ప్రతికూల అంశాలు వృద్ధికి విఘాతంలా మారాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే జీడీపీ అంచనాలకు ఎస్బీఐ, మూడీస్, ఎస్అండ్పీ, ఇక్రా తదితర పరిశోధన సంస్థలు కోత పెట్టాయి. క్రితం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(క్యూ4)లో భారత వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదల 2.7శాతానికే పరిమితం కావొచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యా కాంతి ఘోష్ వెల్లడించారు. ఆర్థిక సంవత్సరం 2021-22లో స్థూలంగా 8.5 శాతానికి అటూ, ఇటుగా జీడీపీ నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. మే 31న కేంద్ర గణంకాల శాఖ అధికారికంగా జీడీపీ వివరాలను వెల్లడించనుంది. ఇంతక్రితం ఆర్థిక సంవత్సరం 2020-21లో 8.9 శాతం వృద్థి నమోదయ్యింది. క్రితం క్యూ4లో పన్ను వసూళ్లలో బలమైన వృద్ధి నమోదు చేసుకుందనీ.. ఇది జీడీపీకి ప్రధాన మద్దతును అందించే అవకాశం ఉందని ఘోష్ తెలిపారు. అధిక ధరల ఒత్తిడి కార్పొరేట్ కంపెనీల నిర్వహణ లాభాలపై ప్రభావం చూపాయన్నారు. వాహన, సిమెంట్, కాపిటల్ గూడ్స్, విద్యుత్ ఉపకరణాలు, వంట నూనెలు తదితర రంగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేసే అవకాశాలున్నాయన్నారు. అధిక ద్రవ్యోల్బణం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఘోష్ పేర్కొన్నారు.
డిమాండ్ మందగింపు : మూడీస్
హెచ్చు ద్రవ్యోల్బణంతో దేశంలో డిమాండ్ రికవరీ మందగించిందని అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ మూడీస్ విశ్లేషించింది. తాజా గ్లోబల్ మైక్రో అవుట్‌లుక్ 2022-23లో భారత జీడీపీ అంచనాలకు కోత పెట్టింది. ముఖ్యంగా పెరుగుతున్న ముడి చమురు, అహార, ఎరువుల ధరలు కుటుంబాల ఆర్థిక పరిస్థితి, వ్యయంపై ఒత్తిడిని పెంచుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాది 2022 భారత జీడీపీ పెరుగుదల 8.8శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. ఇంతక్రితం మార్చిలో ఈ అంచనాలు 9.1 శాతంగా ఉన్నాయి. 2023లోనూ వృద్ధి 5.4 శాతానికే పరిమితం కావొచ్చని విశ్లేషించింది.
ఉత్పత్తికి దెబ్బ : ఎస్అండ్పీ
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల ఊహించినదానికంటే ఎక్కువ కాలం కొనసాగడంతో వృద్ధికి ప్రతికూలంగా మారిందని ప్రముఖ రేటింగ్ ఎజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్అండ్పీ) వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్ పరిణామాలు మరింత ఒత్తిడిని పెంచుతున్నాయని ఇటీవల విశ్లేషించింది. ఈ పరిణామాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశ జీడీపీ 7.3శాతానికి పరిమితం కానుం దని అంచనా వేసింది. ఇంతక్రితం ఈ అంచనా 7.8శాతంతో పోల్చితే భారీగానే కోత పెట్టినట్లయ్యింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం వృద్ధిరేటు 6.5శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ''అధిక ధరలు దీర్ఘకాలం కొనసాగడం ఆందోళనక రం. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను పెంచాల్సి ఉంటుంది. ఈ పరిణామంతో ఉత్పత్తి కార్యకలాపాలపై ఒత్తిడి పెరగడంతో పాటుగా.. ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి.'' అని ఎస్అండ్పీ పేర్కొంది.
ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 8శాతంగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 8.2 శాతంగా నమోదు కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), 7.2 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ, 7.5 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంస్థలు అంచనా వేశాయి. దేశంలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) వరుసగా 13వ మాసంలోనూ రెండంకెల స్థాయిలో నమోదయ్యింది.ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) ఏకంగా 15.08 శాతానికి ఎగిసి.. ఏకంగా రికార్డ్ స్థాయిలో 17 ఏండ్ల గరిష్టానికి చేరిన విషయం తెలిసిందే. కూరగాయలు, ఇంధన, వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. మోడీ సర్కార్ అడ్డగోలుగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధానంగా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయి. అధిక ధరలను ప్రభుత్వాలు కట్టడి చేయకపోవడంతో ప్రజల ఆర్థిక పరిస్థితి దెబ్బతిని.. ఆ ప్రభావం వెంటనే వృద్థిపై పడటం సాధారణమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.