Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా ఎంపీపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబయి : మహిళా ఎంపీపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనకు నేతృత్వం వహిస్తున్న పాటిల్.. 'మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికి వెళ్లి వంట చేసుకోండి' అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఎంపీ సుప్రియా సూలే నుద్దేశించి వ్యాఖ్యానించారు. వివక్షపూరితమైన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. స్థానిక సంస్థల్లో ఎస్‌సీ, ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై స్టే విధించడంతో గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం న్యాయస్థానాల్లో జరిగిన పోరాటంలో ఉద్దవ్ థాకరే ప్రభుత్వం ఓడిపోయిందని బీజేపీ ఆరోపించింది. అయితే కేంద్రమే సరైన సమాచారాన్ని అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కోంది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌కు ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నుంచి ఎలా ఉపశమనం లభించిందని సుప్రియా సూలే ప్రశ్నించారు. 'మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి 'ఎవరినో' కలిశారు.. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియలేదు. మరో రెండు రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగల్ వచ్చింది' అని తెలిపారు. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన పాటిల్ ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాటిల్ వ్యాఖ్యలపై సుప్రియా సూలే భర్త సదానంద్ సూలే స్పందించారు. పాటిల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. 'నా భార్యను చూసి గర్వపడుతున్నాను. ఆమె ఒక గృహిణి, తల్లి. అలాగే.. సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్. బీజేపీ నేతలు స్త్రీ ద్వేషులు. వీలైనప్పుడల్లా స్త్రీలను వారు కించపరుస్తూనే ఉంటారు. దేశంలోని అనేక మంది కష్టపడి పనిచేసే, ప్రతిభావంతులైన మహిళల్లో నా భార్య కూడా ఒకరు. చంద్రకాంత్ పాటిల్ మాటలు మహిళలందరికీ అవమానకరమే' నని పేర్కొన్నారు.