Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ సబ్జెక్టుల్లో గణనీయంగా తగ్గిన విద్యార్థుల మార్కులు
- కరోనా సంక్షోభంతో అనేక ఆటంకాలు
- సామాజికంగా, ఆర్థికంగా ఉన్నవారికే 'ఆన్లైన్ విద్య'
- దేశవ్యాప్తంగా పడిపోయిన 3,5,8,10వ తరగతి విద్యార్థుల స్కోర్
- జాతీయ సగటుకన్నా దిగువన తెలంగాణ విద్యార్థులు :
నేషనల్ అచీవ్మెంట్ సర్వే
గతంతో పోల్చుకుంటే నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ఫలితాలు దారుణంగా దెబ్బతిన్నాయి. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్లలో 10వ తరగతి విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యం వరుసగా 32శాతం, 35శాతం, 37శాతం, 43శాతంగా నమోదయ్యాయని 'నేషనల్ అచీవ్మెంట్ సర్వే' పేర్కొన్నది. 2017నాటి జాతీయ సర్వేతో పోల్చితే, 2021సర్వేలో సగటు ఫలితాలు పడిపోయాయని తెలిపింది.
న్యూఢిల్లీ : తమిళనాడు, తెలంగాణ, మేఘాలయ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జాతీయ సగటు కన్నా దిగువన ఫలితాలు నమోదయ్యాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభం విద్యార్థుల చదువుల్ని కకావికలం చేసింది. సామాజికంగా, ఆర్థికంగా మెరుగైన కుటుంబాల పిల్లలకు ఆన్లైన్ చదువులు అందుబాటులో ఉన్నాయని, మిగతావారికి కష్టసాధ్యమైందని సర్వే ఫలితాలు తెలిపాయి. తరగతి గదిలో బోధన ద్వారా పాఠ్యాంశాలు బాగా అర్థమవుతాయని 80శాతం మంది విద్యార్థులు చెప్పారు.
పంజాబ్, రాజస్థాన్ మినహా
పంజాబ్, రాజస్తాన్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2017 కంటే ముందు స్థాయికి విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యం పడిపోయింది. కేంద్ర విద్యా శాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగానికి సంబంధించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఎఎస్)-2021 నివేదిక విడులైంది. సర్వేలో బయటపడ్డ ఫలితాలకు కరోనా మహమ్మారి ప్రధాన కారణమై ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. దేశంలోని 720 జిల్లాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 1.18 లక్షల పాఠశాలలను, 34 లక్షల మంది విద్యార్థులను పరిశీలించిన అనంతరం నివేదిక రూపొందింది.
గణితంలో జాతీయ సగటు 42శాతం
భాషా నైపుణ్యంలో జాతీయ స్థాయిలో 57 శాతం, పర్యావరణ శాస్త్రం-53 శాతం, సైన్స్‌లో-37 శాతం, సోషల్ సైన్స్-38 శాతం, ఇంగ్లీష్-43 శాతంగా నమోదయ్యాయి. ఈ విషయంలో తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. అయితే 5వ తరగతి స్థాయిలో జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొంత మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు. ఇక 8వ తరగతి స్థాయిలో గణితం, భాషా నైపుణ్యం, సైన్స్, సోషల్ లాంటి అంశాలను పరిశీలించగా అక్కడ కూడా ఇవే ఫలితాలు వచ్చాయి. అయితే ఈ స్థాయిలో ఛత్తీస్‌గఢ్ కొంత మెరుగ్గా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
విద్యా వ్యవస్థకు సవాళ్లు
3, 5, 8, 10వ తరగతుల్లో పిల్లల అభ్యాసనా సామర్థ్యాలపై సమగ్ర మూల్యాంకన సర్వే నిర్వహించడం ద్వారా దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థకు సంబంధించి అంచనా వేసింది. 2021 నవంబర్ 12న అఖిల భారత స్థాయిలో సర్వే జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు (కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం), ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలలు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో సర్వే జరిగింది. 3, 5 తరగతులకు గణితం, భాషా నైపుణ్యాలు, పర్యావరణ శాస్త్రం వంటి విషయాలపై పరిశీలన చేశారు. 8వ తరగతికి భాష, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, 10వ తరగతికి భాష, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, ఇంగ్లీష్ వంటి అంశాలపై సర్వే చేశారు. దేశవ్యాప్తంగా 1,18,274 పాఠశాలలు, 5,26,824 మంది ఉపాధ్యాయులు, 34,01,158 మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. అందులో 49.5 శాతం బాలురు, 50.5 శాతం బాలికలు సర్వే భాగస్వామ్యం అయ్యారు. 67 శాతం గ్రామీణ, 33 శాతం పట్టణ ప్రాంతాల విద్యార్థులు పాల్గొన్నారు. 40 శాతం ప్రభుత్వ, 35 శాతం ప్రైవేట్, 17 శాతం ప్రభుత్వ ఎయిడెడ్, 7 కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు సర్వేలో పాల్గొన్నాయి. ఓబీసీ-42.1 శాతం, ఎస్సీ-16 శాతం, ఎస్టీ-15.2 శాతం, జనరల్-26.20 శాతం సర్వేలో భాగస్వామ్యం అయ్యారు.