Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్ట సవరణలపై బృందాకరత్
- గిరిజనులను అడవికి దూరం చేసేందుకు కుట్రలు
- కేంద్ర విధానాలను పోరాటాలతో తిప్పికొట్టాలని పిలుపు
- ఏపీలోని పాడేరులో బహిరంగ సభ.. భారీగా తరలివచ్చిన గిరిజనం
విశాఖపట్నం : గిరిజన ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టటం కోసం చట్ట సవరణలు చేస్తున్న మోడీ ప్రభుత్వ ప్రయత్నాలను పోరాటాలతో తిప్పికొట్టాలని మాజీ ఎంపీ, ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకరత్ పిలుపునిచ్చారు. కొత్త కొత్త ప్రాజెక్టుల పేరుతో అటవీ ప్రాంతంలో కార్పొరేట్లకు అవకాశం కల్పించేందుకు అటవీ హక్కుల చట్టంలోనూ, పర్యావరణ చట్టంలోనూ మార్పులు తేవాలని కేంద్ర సర్కార్ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మోదకొండమ్మ ఆడిటోరియంలో శుక్రవారం గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స అధ్యక్షతన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బృందాకరత్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ఐదేండ్లలో వేలాది ఎకరాలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి అడవి నుంచి ఆదివాసీలను వెల్లగొట్టిందన్నారు. అజాదీకా అమృత్ మహోత్సవాలు జరుపుతున్న మోడీ ప్రభుత్వం పేదవారికి అమృతం ఇవ్వకుండా విషం ఇస్తోందని విమర్శించారు. ఐదో షెడ్యూల్లో ఆదివాసీలకు ఉన్న ప్రత్యేక చట్టాలను బలహీనపర్చాలని ప్రయత్నిస్తోందన్నారు. పోరాడి సాధించుకున్న ఆర్ఓఎఫ్ఆర్, పీసా చట్టాలను, జీఓలను పోరాటాలతోనే రక్షించుకోవాలన్నారు. ప్రజల హక్కులపై మోడీ, ఆర్ఎస్ఎస్ బుల్డోజ్ దాడి చేస్తున్నాయని విమర్శించారు. పేదలను దోచి ధనవంతులకు కట్టబెడుతున్న మోడీ చర్యలను తన కుర్చీని కాపాడుకోవడం కోసం ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రశ్నించడం లేదన్నారు. కోవిడ్ కాలంలో 94శాతం మంది ఆదివాసీ పిల్లలు చదువుకోలేకపోయారని జార్ఖండ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలో నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని గుర్తించామని అన్నారు. ఉద్యోగాల భర్తీలో నూరు శాతం గిరిజనులకు రిజర్వేషన్ కల్పించిన జీఓ 3ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల తరపున పిటిషన్ వేయాలన్నారు. గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గిరిజన ప్రాంతాల్లో నూరు శాతం ఉద్యోగాలనూ గిరిజనులతో భర్తీ చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చినా ఇప్పటికీ అర్హులైన గిరిజనుల్లో సగం మందికి పట్టాలు ఇవ్వలేదన్నారు. సుదీర్ఘ పోరాటాలతో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకున్నట్టే.. గిరిజన ప్రయోజనాలను దెబ్బతీసే చట్ట సవరణలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సభలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ నాయకులు సిహెచ్ నర్సింగరావు, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సురేంద్ర, వి.తిరుపతిరావు, టి.రామకృష్ణ, అనంతగిరి జెడ్పిటిసి దీసరి గంగరాజు పాల్గొన్నారు. బహిరంగ సభకు ముందు తలారిసింగి పాఠశాల నుంచి మోదకొండమ్మ ఆడిటోరియం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. థింసా నృత్యం, డప్పు వాయిద్యాలతో గిరిజన కళాకారులు అలరించారు.