Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేద విద్యార్థులకు నిధులు కేటాయించాలి
- యువతకు శిక్షణ ఇవ్వాలి : ఏడీబీ రిపోర్ట్
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో దీర్ఘకాలంగా పాఠశాలలు మూసి వేయడం ద్వారా దక్షిణాసియాలోనే భారత జీడేపీ సహా యువత అభ్యాస నష్టాలు ఎక్కువగా జరిగాయని ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) పేర్కొంది. ఈ రంగంలో దేశానికి 2023లో 10.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.79,800 కోట్లు) నష్టం జరుగొచ్చని అంచనా వేసింది. 2030 నాటికి ఇది దాదాపు రూ.7.42 లక్షల కోట్ల నష్టానికి చేరొచ్చని 'పొటేన్షియల్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ -19 రిలేటెడ్ స్కూల్ క్లోజర్స్' అనే రిపోర్ట్‌లో పేర్కొంది. జిడిపిలో ఈ వాటా 3.19 శాతం నష్టంగా ఉండొచ్చని అంచనా వేసింది. విద్యా సంస్థల మూత ద్వారా నైపుణ్యం కలిగిన కార్మిక ఉద్యోగాలు ఒక్క శాతం, నైపుణ్యేతర ఉపాధిలో 2 శాతం తగ్గుదల చోటు చేసుకోవచ్చని పేర్కొంది. భారత గ్రామీణ ప్రాంతాల్లో సెకండరీ విద్య ప్రధానంగా ఉందని.. ఇక్కడి విద్యా సంస్థల మూసివేతలు కూడా విస్తృతంగా జరిగాయని ఈ రిపోర్ట్ తెలిపింది. దీంతో 2023 నాటికి జీడీపీలో 0.34 శాతం, 2026లో 1.36 శాతం, 2030 నాటికి 3.19 శాతం నష్టం జరగొచ్చని అంచనా వేసింది.
''అధిక జనాభా కలిగిన గ్రామీణ ప్రాంతాలలోని పేద పిల్లలు, కళాశాలకు వెళ్లే యువత ఆన్లైన్లో చదువుకోవడానికి అవసరమైన స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోయారు. ప్రభావిత జనాభాలో నైపుణ్యం లేని శ్రామిక శక్తికి వలస వెళుతుంది. భారత్‌లో 25.57 కోట్ల మంది విద్యార్థులు ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసిస్తున్నారని అంచనా. డిజిటల్ విభజనను తగ్గించడంపై దష్టి సారించడంతో పాటుగా విద్య, నైపుణ్యాలపై ఎక్కువ పెట్టుబడులు పెట్టడంతో పాటుగా ప్రభావితమైన పిల్లల మధ్య మూల్యాంకనాలను నిర్వహించడం ద్వారా విద్యార్థులు కోల్పోయిన అవకాశాలను తిరిగి పొందడంలో ప్రభుత్వం సహాయం చేయాలి. ఇది అత్యంత తక్షణ సవాలతో కూడుకుంది.'' అని ఈ రిపోర్ట్ పేర్కొంది. పేద, గ్రామీణ, సామాజికంగా వెనుకబడిన వర్గాల యువ జనాభాకు తగిన నిధులు, వనరులను అందించాలని సూచించింది. ఇప్పటికే బడి బయట ఉన్న యువతకు నైపుణ్య శిక్షణ కోసం అదనపు సహాయాన్ని అందిస్తూ, ఆర్థిక మద్దతు, ప్రోత్సాహకాలను అందించాలని ఈ రిపోర్ట్ సూచించింది.