Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మాదక ద్రవ్యాల కేసులో బాలివుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ లభించింది. ముంబయిలోని ప్రత్యేక కోర్టులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శుక్రవారం నాడు ఛార్జిషీట్ సమర్పించింది. ఇందులో ఆర్యన్ ఖాన్ (24) పేరును చేర్చలేదు. నిందితులుగా ఉన్న 20 మందిలో 14 మందిపై అభియోగాలు నమోదు చేశామని, సాక్ష్యాధారాలు లభించకపోవడంతో ఆర్యన్ సహా ఆరుగురిపై అభియోగాలు నమోదు చేయలేదని ఎన్‌సిబి డైరెక్టర్ జనరల్ ఎన్ ప్రార్ధన్ తెలిపారు. ముంబయిలోని ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఆరోపణలతో ఆర్యన్ సహా 20 మందిని గతేడాది అక్టోబరు 2న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదే నెల 29న బొంబయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ ఖాంఖడే పర్యవేక్షణలో దర్యాప్తు సాగింది. సమీర్.. ఆర్యన్‌ను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు చేపట్టారని, బ్లాక్‌మెయిల్‌కు కూడా పాల్పడ్డారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఐఆర్ఎస్ అధికారి అయిన సమీర్ ప్రస్తుతం ఎన్‌సిబిలో లేరు. ఎన్‌సిబికి డిప్యూటేషన్‌పై వెళ్లిన ఆయన ఈ ఏడాది జనవరిలో తిరిగి మాతృవిభాగమైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌కు బదిలీ అయ్యారు. డ్రగ్స్ కేసులో లోపభూయిష్ట దర్యాప్తుతో పాటు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించారనే ఆరోపణల నేపథ్యంలో సమీర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.