Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెలికి తీసిన ఆర్టీఐ కార్యకర్త
న్యూఢిల్లీ : భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన ప్రాజెక్టులైన కన్యాశ్రీ, యువశ్రీ వంటివాటిపై ఆడిట్ చేయలేదు. ఈ ప్రాజెక్టుల కోసం ఏటా రూ. 1000 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించినట్టు ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. అయినప్పటికీ, సమాచార గోప్యతను పేర్కొంటూ ఈ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడానికి ప్రభుత్వం నిరాకరించింది. పైన పేర్కొన్న పథకాలతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 70 ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టులలో కాగ్ ఆడిట్ జరగలేదని సామాజిక-న్యాయ పరిశోధకుడు, ఆర్టీఐ కార్యకర్త బిశ్వనాథ్ గోస్వామి దాఖలు చేసిన అనేక ఆర్టీఐలలో ఈ సమాచారం వెల్లడైంది. ''2018 సెప్టెంబర్‌లో, చట్టబద్ధమైన ఆడిట్, తనిఖీల కోసం వివిధ సామాజిక భద్రతా పథకాలు, ప్రాజెక్టులు, శాంతిభద్రతల సమస్యలపై కీలకమైన సమాచారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు నిరాకరించిందని ఆర్టీఐ చట్టం కింద కాగ్ అధికారికంగా నాకు తెలియజేసింది'' అని గోస్వామి తెలిపారు. '' ఇలాంటి తిరస్కరణలపై వివరణాత్మక సమాచారాన్ని కోరుతూ నేను మరొక ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేసినప్పుడు కాగ్ పూర్తిగా తప్పుడు, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాంటి సమాచార తిరస్కరణ జరగలేదని పేర్కొన్నది'' అని ఆయన అన్నారు. గత పదేండ్లలో ఇలాంటి పథకాల కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చులు చూపబడ్డాయి. ఈ పథకాల్లో చాలా వరకు లబ్దిదారులకు నేరుగా నగదు చెల్లింపులు ఉండటంతో అక్రమాలకు ఆస్కారం ఏర్పడింది. ''2011 నుంచి ఇప్పటి వరకు సామాజిక భద్రతా పథకాలు, ప్రాజెక్టుల ఆడిట్‌పై ఒక నిర్దిష్ట ప్రశ్నపై పశ్చిమ బెంగాల్‌లో గత కొన్నేండ్లలో కేవలం 2-3 ప్రాజెక్టులు మాత్రమే ఆడిట్‌కు గురయ్యాయని కాగ్ తెలిపింది. ఇవి ఆడిట్ తప్పనిసరి అయిన ప్రాజెక్టులు. లేకపోతే నిధుల విడుదల జరగదు. ఆడిట్‌లు అటువంటి పథకాలకే పరిమితం చేయబడ్డాయి'' అని గోస్వామి అన్నారు.