- ఏడుగురు జవాన్ల దుర్మరణం శ్రీనగర్: జమ్ములోని లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తోన్న ఓ వాహనం నదిలో పడి ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. శుక్రవారం ఉదయం పార్థాపూర్ శిబిరం నుంచి 26 మంది సైనికులు వాహనంలో హనీఫ్ సబ్ సెక్టార్ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టుర్టుక్ సెక్టార్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదవశాత్తు రోడ్డుపై నుంచి జారి షియోక్ నదిలో పడింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.