Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని మోడీ సర్కారు
- డబ్ల్యూహెచ్ఓ గుర్తించినా.. కేంద్ర సర్కారులో లేని చలనం
- కనీస వేతనాలు అందించాలని సీఐటీయూ డిమాండ్
న్యూఢిల్లీ : మే 22న భారత్‌లోని ఆశా వర్కర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు అందింది. ప్రపంచ ఆరోగ్యం, ప్రాంతీయ ఆరోగ్య సమస్యల మీద వారికున్న నిబద్ధత, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించినందుకు గానూ వారికి ఈ గుర్తింపు లభించింది. ఇందులో ఆఫ్ఘనిస్థాన్‌లోని ఎనిమిది మంది వాలంటీర్ పోలియో కార్యకర్తలకు వారి మరణం తర్వాత ఈ అవార్డు లభించింది. 75వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వేదికగా డబ్ల్యూహెచ్ఓ ఆశా కార్యకర్తలకు గుర్తింపుపై ప్రకటన చేసింది. తొలుత 2005లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద దీనిని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా మహిళలు ఆశాలుగా పని చేస్తున్నారు. దేశ ఆరోగ్య వ్యవస్థలో పేద, అణగారిన వర్గాల ప్రజలకు వీరు ఎంతగానో సేవలు అందిస్తున్నారు. దాదాపు 60 రకాల టాస్క్‌లను వీరు చేస్తారు. ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలిస్తున్న వీరు మాత్రం వర్కర్లుగా గుర్తింపునకు నోచుకోలేకపోతున్నారు.
గౌరవ వాలంటీర్లుగా పేర్కొనబడుతూ వారు చేసే టాస్క్‌ల ఆధారంగా ప్రోత్సాహకాలను పొందుతారు. కొన్ని రాష్ట్రాల్లో వీరికి దక్కేది రూ. 2000 లు కావటం గమనార్హం. అయితే ఇప్పటికే అనేక సమస్యలతో ఆర్థికంగా చితికిపోతున్న వారికి ఈ సరిపోని చెల్లింపులు కూడా ఆలస్యంగా జరగటం ఆందోళనకరం. ఇలాంటి తరుణంలో డబ్ల్యూహెచ్ఓ అవార్డు ఆశా వర్కర్ల పనికి గుర్తింపు మాత్రమే కాదు.. పని ఆవశ్యకతను గుర్తించినట్టయ్యింది. ఇది ఆశావర్కర్ల నిస్వార్థ సేవకు గుర్తింపు అని సీఐటీయూ నేషనల్ సెక్రెటరీ ఏఆర్ సింధూ తెలిపారు. అయితే, వారి పనికి తగిన చెల్లింపులు దక్కకపోవడమే ఇక్క అసలైన ప్రశ్న అని అన్నారు. భారత ప్రభుత్వమే దోపిడీ చేస్తున్నదని తెలిపారు. ఆశాల పనిని బేసిక్ సర్వీసుగా, ప్రజల హక్కుగా గుర్తించాలన్నదే మా మొదటి డిమాండ్ అని ఆమె అన్నారు.
కుటుంబాలకు దూరంగా..
కనీసం వేతనం, సామాజిక భద్రత, పెన్షన్లతో పాటు ఇతర ప్రయోజనాల విషయంలో తమను రెగ్యులరైజేషన్ చేయాలని కొన్నేండ్లుగా ఆశాలు, ఇతర ప్రభుత్వ పథకాల వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో కోవిడ్-19 మహమ్మారితో ఈ డిమాండ్లు మరింత అత్యవసరంగా మారాయి. మహమ్మారి కాలంలో ఆశాలు ఫ్రంట్‌లైన్ వారియర్లుగా తీవ్రంగా కష్టపడి పని చేశారు. ఇలాంటి తరుణంలో కుటుంబాలకు దూరంగా ఉన్నారు. మహమ్మారి బారిన పడి క్యారంటైన్ సెంటర్లలో గడిపారు. ఎలాంటి వారాంతపు సెలవులు లేకుండా.. రోజుకు 14 గంటలు విధులను నిర్వర్తించారు. 2020లో ఆక్స్‌ఫామ్ సర్వే ప్రకారం.. 25 శాతం మంది ఆశా వర్కర్లకు మాస్కులు అందలేదు. 38 శాతం మందికి గ్లౌజులు అందలేదు. 23 శాతం మంది మాత్రమే హజ్మత్ సూట్లను పొందగలిగారు.
అనేక అవమానాలు
ఇంత కష్టాలను ఎదుర్కొని విధులు నిర్వర్తించినా.. వారిని ఆరోగ్య సిబ్బందిగా గుర్తించే ప్రయత్నాలే జరగకపో వడం గమనార్హం. మహమ్మారి సమయంలో 'కోవిడ్ వారియర్స్'గా ఉన్న వీరిని 'కోవిడ్ క్యారియర్స్' అంటూ గాలి వార్తలు ప్రచారం సాగింది. అనేక ప్రాంతాల్లో వారిని దూరం గా పెట్టిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.
అలవెన్సులకు బ్రేక్
కరోనా కాలంలో ఎంత మంది ఆశా వర్కర్లు చనిపోయారన్నదానిపై భారత ప్రభుత్వం ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. 2021లోని నివేదికల ప్రకారం.. కోవిడ్ సంబంధిత విధుల కారణంగా 100 మంది ఆశా వర్కర్లు తమ ప్రాణాలను కోల్పోయారు. 2020లో ఆరోగ్య వర్కర్ల కుటుంబాలకు మోడీ ప్రకటించిన రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ ఆశా వర్కర్ల కుటుంబాలకు అందలేదు. కోవిడ్-19 రిస్క్ అలవెన్సుగా నెలకు అందించే రూ. 1000 ఆగిపోయింది.తమ పట్ల ప్రభుత్వ ఉదాసీనతను వ్యతిరేకిస్తూ ఆశా వర్కర్లు స్థానికంగా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. వారి పోరాటాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. హర్యానా, బీహార్లలో ఇటీవల నిరసనలు చోటు చేసుకున్న విషయం విదితమే.
'డిమాండ్లు నెరవేరకపోతే ఉద్యమం ఉధృతం'
45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌లో చేసిన ప్రతిపాదనలు అమలు చేయాలని కేంద్రాన్ని సీఐటీయూ అనుబంధ ఆలిండియా కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేస్తున్నది. వారిని రెగ్యులరైజ్ చేయాలనీ, రూ. 21 వేల కనీస వేతనాన్ని కల్పించాలని, నెలకు రూ. 10 వేల పెన్షన్‌ను అందించాలని తెలిపింది. ఆరోగ్య రంగాన్ని ప్రయివేటీకరించాలని మోడీ ప్రభుత్వం చూస్తున్నది. వీరి హక్కులను ప్రభుత్వం వీరికి కల్పించకపోతే, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం'' అని సింధూ చెప్పారు. కాగా, ఈ డిమాండ్ల సాధన కోసం జులైలో ఆలిండియా స్థాయిలో నిరసనల జరిగే అవకాశం ఉన్నది.