Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీ రైతాంగం సిద్ధం కావాలి శ్రీ రైతుసంఘం బహిరంగసభలో హన్నన్ మొల్లా పిలుపు
- అనంతలో అన్నదాతల భారీ ప్రదర్శన
అనంతపురం : రైతులను అన్ని విధాల మోసం చేసి పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు కారణమౌతున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మలిదశ పోరాటానికి సిద్ధం కావాలని అఖిలభారత కిసాన్ సభ (ఎఐకెఎస్) ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా పిలుపు నిచ్చారు. మూడు రోజులపాటు అనంతపురంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 22వ రాష్ట్ర మహాసభ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్నదాతలు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంత రం ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ చంద్రశే ఖరరెడ్డి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. వేలాది మంది హాజరైన ఈ సభలో హన్నన్ మొల్లా మాట్లాడుతూ మలిదశ పోరాటానికి త్వరలోనే కార్యాచరణ ప్రణాళి కను ప్రకటించనున్నట్లు చెప్పారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేసేందుకు రైతాంగం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇటీవలి చారిత్రాత్మక రైతు ఉద్యమ స్ఫూర్తితో కార్మిక-కర్షక మైత్రితో పోరాడి మోడీ ప్రభుత్వ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. 'వచ్చే నెలలో సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం జరుగుతుంది. సుదీర్ఘపోరాటం ఫలితంగా నల్ల చట్టాలు రద్దయినా ముఖ్య డిమాండ్లు అలానే ఉన్నాయి. ఎంఎస్పికి చట్ట బద్ధత, రుణ మాఫీ సాధన కోసం రెండవ దశ పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తుంది. దాని ప్రకారం రైతులు కదలాలి.' అని అన్నారు.
మోడీ మోసం వల్లే ఆత్మహత్యలు
2014 ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీ దేశ వ్యాప్తంగా 400 బహిరంగసభల్లో రైతుల అభ్యున్నతి, సంక్షేమం కోసమంటూ పలు వాగ్దానాలు చేసి, ఎనిమిదేళ్లలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని చెప్పారు. ఎన్నికలకు ముందు స్వామినాథన్ కమిటీ సిఫారసులకు హామీ ఇచ్చి, సుప్రీంకోర్టుకు అమలు చేయలేమని అఫిడవిట్ ఇచ్చారు. గడచిన 30 ఏళ్లలో దేశంలో 4 లక్షల రైతు ఆత్మహత్యలు జరిగితే, బిజెపి ఎనిమిదేళ్ల పాలనలో లక్ష మంది రైతులు బలవన్మరణం పాలయ్యారని చెప్పారు. సగటున రోజుకు 32 ఆత్మహత్యలు సంభవించాయని, రైతులను మోడీ మోసం చేయడం వల్లనే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. 2014లో అధికారంలోకి రాగానే రైతుల భూములను లాక్కొనేందుకు బిజెపి సర్కారు భూసేకరణ చట్టం తెచ్చిందని, భూమి అధికార్ ఆందోళన పేరుతో రైతు సంఘాలతో అఖిల భారత కిసాన్ సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి ఎఐకెఎస్ మూడేళ్లు చేసిన పోరాటంతో దానిని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 500 సంఘాలతో సంయుక్త కిసాన్ మోర్చాను ఏర్పాటు చేసి వీరోచితంగా ఏడాదిపాటు పోరాడిన ఫలితంగా విధిలేని పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం చట్టాలను ఉపసంహరించుకుందని చెప్పారు. 'మోడీ ప్రభుత్వం ప్రజానుకూల ప్రభుత్వం కాదు. అదానీ, అంబానీ అనుకూల ప్రభుత్వం. కార్పొరేట్-మతతత్వ-ఫాసిస్టు తరహా సర్కారు . ఏడాది పాటు సాగించిన పోరాట స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలి.' అని అన్నారు. 'క్వింటా వరి ధాన్యానికి సర్కారు ప్రకటించిన ఎంఎస్పి రూ.1,970, పండించడానికి అయ్యే ఖర్చు రూ.2,200-2,500, రైతుకు ధర వచ్చేది రూ.1,200-1,300, అంత నష్టం వస్తున్నప్పుడు రైతు ఆత్మహత్య చేసుకోక మరేం చేస్తాడు? కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం క్వింటాకు రూ.2,820 ఇస్తోంది. దేశ వ్యాప్తంగా 20 శాతం మందికే ఎంఎస్పి లభిస్తోంది. తతిమ్మా 80 శాతం తక్కువకు అమ్ముకుంటున్నారు. మోడీ 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్నారు. రైతుల ఆదాయాలు పెరగలేదు సరికదా తగ్గిపోతున్నాయి.' అని అన్నారు. ఎఐకెఎస్ సంయుక్త కార్యదర్శి విజ్జూకృష్ణన్ మాట్లాడుతూ సరళీకరణ ఆర్థిక విధానాల వల్లే రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని, ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాడాలని చెప్పారు. రైతు సంఘం మాజీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి మొండిగా రైతులపై భారాలు మోపుతోందని, దీనికి వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు చేయాలని అన్నారు. రైతు సంఘం మాజీ సహాయ కార్యదర్శి పి. మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాష్ట్రంలో అధికారంలోనున్న వైసిపి, ప్రతిపక్ష టిడిపిలు మౌనం వీడి ప్రశ్నించాలని అన్నారు. బిసి, ఎస్సి, ఎస్టి మైనార్టీలకు ఆర్థిక పురోభివృద్ధికి చర్యలు చేపట్టినప్పుడే సామాజిక న్యాయం చేసినట్టవుతుందన్న విషయాన్ని వైసిపి గుర్తించాలన్నారు. సభలో రైతుసంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై కేశవరావు, ఎం సూర్యనారాయణ ప్రసంగించారు. వేదికపై ఎపి కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, రైతుసంఘం ఆఫీస్బేరర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆసీనులయ్యారు.