Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య సదుపాయాలను పొందడంలో అనేక ఇబ్బందులు
- పురుషులు, స్త్రీల మధ్య అసమానత
- స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్న అతివలు 10 శాతం మందే..! : ఎన్ఎఫ్హెచ్ఎస్
ఆరోగ్య సంరక్షణ దేశంలోని మహిళలకు ఆందోళనకరంగా మారింది. దాదాపు 60శాతం మంది వైద్య సదుపాయాలను పొందటంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఐదో రౌండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)లో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా 15-49 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన బాలికలు, యువతులు, మహిళల నుంచి ఈ సర్వేలో సమాచారాన్ని సేకరించారు. వారు అనారోగ్యంగా ఉన్న సమయంలో వైద్య చికిత్సలను పొందే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఈ నివేదికలో పొందుపరిచారు.
న్యూఢిల్లీ : సరైన మౌలిక వసతులు లేకపోవటం, ఆరోగ్య సిబ్బంది కొరత.. వెరసి మహిళలను ఆరోగ్య సంరక్షణకు దూరం చేశాయి. రోగాలకు సరైన మందులు లభించటం లేదని 40.4 శాతం మంది మహిళలు తెలిపారు. ఇక ఆరోగ్య సిబ్బంది గురించి 39.2 శాతం మంది మహిళలు నివేదించారు. ఆరోగ్య కేంద్రాల వద్ద మహిళా ఆరోగ్య కార్యకర్త లేకపోవటంపై 31.2శాతం మంది మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ రూపొందించిన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2021 ప్రకారం.. దేశంలో మొత్తం 1,40,653 మంది ప్రభుత్వ అల్లోపతి డాక్టర్లు ఉన్నారు. అంటే.. 9,679 మందికి ఒక్క అల్లోపతి డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. అలాగే, దేశంలో నమోదిత నర్సింగ్ సిబ్బంది సంఖ్య 33.41 లక్షలుగా ఉన్నది. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భరతు ప్రవీణ్ పవార్ ఈ విషయాన్ని రాజ్యసభలో వెల్లడించారు.
మహిళలు ఆరోగ్య సంరక్షణను పొందే క్రమంలో కనీసం ఎనిమిది సమస్యలు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఎన్ఎఫ్హెచ్ఎస్ గుర్తించింది. వైద్య సదుపాయాన్ని పొందే క్రమంలో కనీసం ఒక్క సమస్యను ఐదింటా మూడు వంతుల మంది మహిళలు వెల్లడించారు. ఈ సమస్యను అత్యధికంగా 70.9 శాతం మంది ఆదివాసీ మహిళలు నివేదించారు. 21.4 శాతం మంది మహిళలు మాత్రం వైద్య చికిత్సను పొందటంలో డబ్బును సమస్యగా తెలిపారు.
వైద్యం కోసం జేబుల నుంచి ఖర్చు
నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్ఓ) రూపొందించిన హెల్త్ ఇన్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. సగటున గ్రామీణ మహిళలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరటం ద్వారా అయ్యే వైద్య ఖర్చుల కోసం (శిశు జననాలు మినహాయించి) తమ సొంత జేబుల నుంచి రూ.3,350 వెచ్చించారు. ఇక పట్టణ ప్రాంతాల్లోని మహిళల విషయంలో ఇది రూ. 4,100గా ఉన్నది. ఇక ప్రయివేటు ఆస్పత్రుల్లో ఈ ఖర్చులు దాదాపు ఏడు రెట్లు అధికంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ. 21,898గా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో రూ. 28,988 గా ఉండటం గమనార్హం. ఇక ఆస్పత్రుల్లో చేరకుండా అయ్యే చికిత్స కోసం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు సగటున రూ.285 లు ఖర్చు చేశారు. పట్టణ ప్రాంతాల మహిళల విషయంలో ఇది రూ.336గా ఉన్నది. ప్రయివేటు ఆస్పత్రుల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల మహిళలు ఇందుకు సగటున రూ.1024 ఖర్చు చేయగా, పట్టణ ప్రాంతాల్లో రూ.1135గా ఉన్నది.
మెడికల్ కేర్‌ను పొందే క్రమంలో కనీసం ఒక్క సమస్యనైనా ఎదుర్కొంటున్నామని 66.5శాతం మంది మహిళలు నివేదించినట్టు ఎన్ఎఫ్హెచ్ఎస్ ఐదో రౌండ్లో వెల్లడైంది. కనీసం 23.2శాతం మంది మహిళలు ఆరోగ్య సదుపాయానికి దూరంగా ఉండటం పట్ల ఆందోళనను వ్యక్తంచేశారు. ఆరోగ్య కేంద్రానికి చేరటం కోసం రవాణా సదుపాయం లేకపోవడాన్ని 21.5శాతం మంది మహిళలు సమస్యగా వెల్లడించారు. వైద్య చికిత్స కోసం తాము అనుమతులు పొందలేదని 13.5శాతం మంది మహిళలు తెలిపారు. 16.7శాతం మంది మాత్రం తమతో పాటు వైద్య చికిత్సకు వచ్చేవారులేరని చెప్పారు. దేశంలో 10.1శాతం మంది మహిళలు మాత్రమే తమ ఆరోగ్య సంరక్షణ విషయంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎన్ఎఫ్హెచ్ఎస్ కనుగొన్నది. అయితే, ఇది పురుషుల్లో మాత్రం అధికంగా 33శాతంగా ఉండటం గమనార్హం. అలాగే, 51.6శాతం మంది మహిళలు ఒంటరిగా ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు.
దేశంలో 29.8శాతం మంది మహిళలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది. పురుషుల్లో ఈ సంఖ్య 33.3శాతంగా ఉండటం గమనించాల్సిన విషయం. గత ఐదేండ్లలో మహిళల్లో రక్తహీనత వ్యాధి వ్యాప్తి పెరిగిందని ఎన్ఎఫ్హెచ్ఎస్ కనుగొన్నది. 2016లో ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళల సంఖ్య 53.1 శాతంగా ఉండగా, తాజాగా అది 57 శాతానికి పెరిగింది.
వైద్య నిపుణులు ఆందోళన
భారత్‌లో ఇలాంటి పరిస్థితులపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. 'భారత్‌లో ఆరోగ్య సంరక్షణను పొందే విషయంలో మహిళలు, పురుషుల మధ్య చాలా అసమానత ఉన్నది. నాలుగు, ఐదో రౌండ్ ఎన్ఎఫ్హెచ్ఎస్ మధ్య ఈ విషయంలో మాకు మెరుగుదల కనిపించలేదు' అని బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ డైరెక్టర్ (పరిశోధన) డాక్టర్ ప్రశాంత్ ఎన్ శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేయాలని వైద్య నిపుణులు సూచించారు. వైద్య చికిత్స సులువుగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.