Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగదు సాయం పొందలేకపోతున్నారు : పంజాబ్లో రైతు సంఘాలు
న్యూఢిల్లీ : వెబ్ పోర్టల్లో డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే నగదు బదిలీ పథకం 'డీఎస్ఆర్' అమలుజేయడాన్ని పంజాబ్లో రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ రైతులకు పెద్ద అడ్డంకిగా ఉందని 'కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ (పంజాబ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. వరిసాగు చేసే రైతులకు ప్రతిఏటా ఎకరానికి రూ.1500లను పంజాబ్ ప్రభుత్వం నగదు బదిలీ పథకం (డీఎస్ఆర్) ద్వారా రైతుల ఖాతాలో జమచేస్తోంది. డీఎస్ఆర్ వెబ్పోర్టల్లో రైతులు తమ సాగు భూమి వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన సాంకేతిక పరిజ్ఞానంతో పంట సాగుచేపట్టామని వెబ్పోర్టల్లో రైతులు తెలపాల్సి ఉంటుంది. అటు తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు ఆ రైతు పంట పొలాలకు వచ్చి పరీశీలన జరిపాక, ప్రతి ఎకరానికి రూ.1500 నగదు మొత్తాన్ని ప్రభుత్వం రైతు ఖాతాలో జమచేస్తుంది. అయితే ఈ పథకం అమలులో ఉన్న సంక్లిష్టత, సాంకేతిక పరిజ్ఞానం పట్ల రైతులకు అవగాహన ఉండదని, దాంతో చాలామంది రైతులకు పథకం వర్తించటం లేదని కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ విమర్శించింది. సులభమైన, సరళతరమైన ప్రక్రియ ద్వారా పథకం అమలు చేపట్టాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది.