Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహానాడు వేదికగా బాబు ఆరోపణ
- ప్రతిపైసా కక్కిస్తానని ప్రకటన
- బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు
ఒంగోలు : మూడు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1.75 లక్షల కోట్లను దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఏపీలోని ఒంగోలులో రెండు రోజుల పాటు జరిగిన మహానాడు ముగింపు సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో బహిరంగ సభ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. తమ అంచనాలకు మించి లక్షలాదిగా తరలివచ్చారని టీడీపీ నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాము చేసే ప్రతి ఆరోపణకు ఆధారాలున్నాయని చెప్పారు. 'మద్యం విక్రయాల్లో ప్రతి క్వార్టర్‌పై జగన్‌కు 12 రూపాయల వాటా వెడుతోంది. లిక్కర్ ద్వారానే ఏటా 5వేల కోట్ల రూపాయలు ఆయనకు వెడుతున్నాయి. బద్వేలులో 8 వేల ఎకరాలు కబ్జా చేశారు. గూగుల్ మ్యాపులు ఉన్నాయి. మూడేళ్లలో జగన్‌రెడ్డి 1.75 లక్షల కోట్లు దోచుకున్నారు. ఈ అవినీతి సొమ్మంతా కక్కిస్తా.' అని ఆయన అన్నారు. వైసీపీ నేతలు అనేకచోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించారనీ, బెదిరించి పరిశ్రమలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 'ఏ ఒక్కరినీ వదిలేది లేదు. అక్రమణలకు గురై, అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుంటాం. ప్రజలకు పంచుతాం.' అని ఆయన అన్నారు. 'ప్రజలపై భారాలు వేస్తూ ఒక వైపు.. సహజవనరులు దోచుకుంటూ మరో వైపు రాష్ట్రాన్ని లూటీ చేశారు' అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలన్నీ జగన్ తాకట్టు పెట్టాడని విమర్శించారు. ప్రత్యేక హోదా.. విశాఖ ఉక్కు.. పోర్టులు, పోలవరం అన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. మహానాడు బస్సులు ఇవ్వలేదని, చివరకు వారికి బస్సులు మిగిలితే టీడీపీతో జనం మిగిలారని అన్నారు. 'మన సభ ప్రజలతో కళకళ లాడుతోంది. వారి బస్సు యాత్ర వెలవెల పోతోంది.' అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'గడప గడపకూ.. ' కార్యక్రమంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. అన్నీ గాలి మాటలు తప్ప ప్రభుత్వం చేసిందేమి లేదని చెప్పారు.' కరెంటు ఛార్జీలు పెంచారా? లేదా? ఏమి చేసినా అడిగే వాళ్లు లేరని ఇష్టానుసారంగా పెంచుతారా? పెట్రోలు, డీజిల్, గ్యాస్.. ఇలా ప్రతిదీ పెంచుకుంటూ పోతున్నారు. ఇలాగైతే రాష్ట్రం శ్రీలంకగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు' అని అన్నారు. సంక్షేమానికి తాము 53 శాతం నిధులను కేటాయిస్తే ఇప్పుడు 41 శాతానికి తగ్గించి 'సంక్షేమం' అంటూ బూటకపు మాటలు చెబుతున్నారన్నారు. 'రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇదంతా ఎవరు కడతారు? జగన్ కడతారా? రేపు మనమే కట్టాలి.' అని అన్నారు. ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ గనులను ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారన్నారు. రేపు అందరి అవినీతిపైనా విచారణ చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు కూడా ఆలోచించాలన్నారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటివి చేశారా? అని ప్రశ్నించారు. ఉద్యోగులు చేసే పోరాటాలకు అండగా ఉంటామన్నారు. సభలో జాతీయ కార్యదర్శి లోకేష్, సినీ నటుడు బాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పలువురు నేతలు ప్రసంగించారు.