Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వతంత్ర పోరాట చరిత్రను విస్మరిస్తున్నారు : భగత్‌సింగ్ మనవడు జగ్మోహన్సింగ్
- సమానత్వానికి ప్రాధాన్యత లేదు : విద్యావేత్తలు
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ సిద్ధం చేసిన 'నూతన విద్యా విధానం' (ఎన్ఈపీ) ముసాయిదా ప్రతిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎన్ఈపీ ముసాయిదా ప్రతిలోని విషయాలు బయటకొచ్చాక, ఈ విధానం అత్యంత ప్రమాదకరమైందని మేథావులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఈపీ స్వతంత్ర పోరాట స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని, ఇది కేవలం విద్యారంగంపైన్నే కాదు..యావత్తు దేశ ప్రజలందరిపైనా ప్రభావం చూపుతుందని భగత్‌సింగ్ మనవడు జగ్మోహన్సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. లౌకక భావనలు, సమానత్వం, అంటరానితనానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు...ఇవేవీ ఇక అక్కర్లేదన్నట్టుగా మన పాలకులు ఎన్ఈపీ విధానాన్ని తీసుకొస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్ఈపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేపట్టే అంశంపై చర్చించేందుకు న్యూఢిల్లీలో విద్యావేత్తలు, మేథావులు, సామాజిక కార్యకర్తలు ఇటీవల సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎన్ఈపీ ముసాయిదా ప్రతిపై జగ్మోహన్సింగ్ మాట్లాడుతూ..''సమున్నత ఆశయాల కోసం మన పూర్వీకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. కులం, మతం, ప్రాంతం, భాష..అనే తేడా లేకుండా అందరూ విద్యను సమానంగా పొందాలని, లింగ వివక్షను రూపుమాపాలని వారు ఎన్నో కలలు కన్నారు. ఇప్పుడా స్ఫూర్తి అంతా దెబ్బతినేలా కేంద్రం నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తోంది. మొత్తం స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని పాలకులు మరిచిపోయారు'' అని అన్నారు. జగ్మోహన్ సింగ్ లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఢిల్లీ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయిన మధు ప్రసాద్ మాట్లాడుతూ...''సమానత్వం..అనే కీలకమైన అంశానికి మనదేశంలోని విద్యా విధానాలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి. దీనికి విరుద్ధంగా ఎన్ఈపీని తీసుకొస్తున్నారు. అందరికీ ఉచిత విద్యను అమలుజేయాలని 1882లోనే బ్రిటీష్ పాలకులకు దాదాభారు నౌరోజీ, మహాత్మా ఫూలే సిఫారసులు చేశారు. సమాజాన్ని మేథోపరమైన అభివృద్ధి వైపు తీసుకెళ్లేలా విద్య ఉండాలని 1920లో భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇవేవీ పనికిరానివని నేటి పాలకులు భావిస్తున్నారు. స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఎన్ఈపీ ఉంది''అని ఆగ్రహం వ్యక్తం చేశారు.