Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో స్వాతంత్య్ర పోరాటానికి ఆదివాసీలు కదలాలి
- జిఒ నంబర్ 3 పునరుద్ధరణకు జూన్ 6 నుంచి జాతీయ స్థాయి ఉద్యమం : బృందాకరత్
విశాఖ : దేశంలో అటవీ ప్రాంతం నుంచి ఆదివాసీలను తరిమేసే విధానాన్ని కేంద్రంలో బిజెపి నాయకత్వానగల నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకుందని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ ఉపాధ్యక్షులు బృందాకరత్ అన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు మరో స్వాతంత్య్ర పోరాటానికి ఆదివాసీలంతా కదలాలని పిలుపునిచ్చారు. 'జిఒ నంబర్ 3 రిజర్వేషన్ - ఆదివాసీల హక్కు' అనే అంశంపై విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన జరిగిన సెమినార్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. 75 ఏళ్ల స్వతంత్య్ర భారతదేశంలో 'ఆజాదీ కా అమృత్ మహాత్సవ్' అంటూ మోడీ ఊదరగొడుతున్నాడని, తన కార్పొరేట్ విధానంతో అమృతం కార్పొరేట్లకు, కష్టాలను దేశంలోని గిరిజన, దళితులు, సామాన్యులకు మిగుల్చుతున్నారని విమర్శించారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదం కూడా ఈ విధంగా ఉందని తెలిపారు. నేషనల్ మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసి, దేశంలో ద్రవ్యోల్బణం పెంచితే ఎవరు నిర్భయంగా జీవించగలరని ఆమె ప్రశ్నించారు. దేశంలో ప్రభుత్వాలు అమలు చేసే పట్టణీకరణ వల్ల గిరిజనులు వారి ప్రాంతాల నుంచి వెళ్లగొట్టబడుతున్నారని ఛత్తీస్గఢ్, రాంచీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రస్తుతం ఇదే జరుగుతోందని తెలిపారు. విశాఖలో ఈ నెల శని, ఆదివారాల్లో ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశాల్లో 15 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. దీంట్లో పాల్గొన్న మధ్యప్రదేశ్, తెలంగాణ నుంచి ఆదివాసీ నాయకులు చెబుతున్న ప్రకారం ఆదివాసీలను భూముల్లోకి వెళ్లనీయకుండా ప్రభుత్వాలు పెద్ద పెద్ద కందకాలు తవ్వేస్తున్నాయని, ఇది చాలా బాధాకరమని అన్నారు.