Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై, ఆగస్టులో ఉన్నది : సీఆర్ఈఏ నివేదిక
న్యూఢిల్లీ: దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు రుతు పవనాలకు ముందు తగినన్ని బొగ్గు నిల్వలను సమకూర్చుకోలేకపోయినందున జులై- ఆగష్టులో మరో విద్యుత్ సంక్షోభం వచ్చే ప్రమాదముందని స్వతంత్ర పరిశోధనా సంస్థ తాజాగా విడుదలజేసిన ఒక నివేదికలో పేర్కొంది. సెంటర్ ఫర్ క్లీన్ ఎయిర్ ( సీఆర్ఈఏ) ఆదివారం విడుదలజేసిన నివేదిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలను పరిశీలిస్తే దేశంలో విద్యుత్ సంక్షోభం పరిష్కారమయ్యే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదని ఆ నివేదిక పేర్కొంది. నైరుతి రుతుపవనాలు వచ్చాక గనుల నుండి బొగ్గు తవ్వకాలు, విద్యుత్ కేంద్రాలకు చేరవేయడానికి పలు ఆటంకాలు ఏర్పడతాయని సీఆర్ఈఏ వివరించింది. మేనెల ప్రారంభంలో నాన్పిట్ హెడ్ పవర్ స్టేషన్లలో నిర్దేశించిన 20-26 రోజులకు సరిపడా నిల్వలు ఉండాలి. కానీ, కేవలం ఆరు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. రుతుపవనాలకు ముందు అతి తక్కువగా ఉన్న బొగ్గు నిల్వలు జులై-ఆగష్టులో మరో విద్యుత్ సంక్షోభానికి సంకేతమని సీఆర్ఈఏ తెలిపింది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు అవసరమైన కసరత్తు చేసేందుకు మూడు నెలల వ్యవధి దొరికింది. అయినా, తగిన సన్నాహాలు చేయడంలో ప్లాంట్ ఆపరేటర్లు, రేగ్యులేటర్లు విఫలమయ్యారని సీఆర్ఈఏ విశ్లేషకుడు సునిల్ దహియా విమర్శించారు. విద్యుత్ కొరత సమస్య బొగ్గు ఉత్పత్తి వల్ల ఉత్పన్నమైనది కాదు, బొగ్గు సరఫరా, ప్రభుత్వ ఉదాసీనత వల్ల ఏర్పడిందేనని సీఆర్ఈఏ పేర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరంలో 777.26 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. ఇది గత సంవత్సరంతో పోల్చితే 8.5 శాతం అధికం. ఈ సంవత్సరం బొగ్గు ఉత్పత్తి దాని చరిత్రలోనే అత్యధికం.విచిత్రమేమిటంటే ఇంత భారీగా బొగ్గు ఉత్పత్తి అయిన సమయంలోనే తీవ్రమైన వడగాడ్పులు, భీకర ఎండల మధ్య కోట్లాది మంది ప్రజలు విద్యుత్ కోతలతో విలవిలలాడుతున్నారని దహియా అన్నారు. బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్న విద్యుత్ కేంద్రాలకు బొగ్గును చేరవేయడానికి గూడ్స్‌ను పెంచడానికి బదులు, వందలాది గూడ్స్‌ను రద్దు చేశారని సీఆర్ఈఏ తెలిపింది. దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తే 70 శాతం దాకా ఉంటోంది.