Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ సర్కార్ విధానాల వల్లే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
- రెండుసార్లు అధికారం ఇచ్చినా..జనాలకు ఒరిగిందేమీ లేదు : రాజకీయ విశ్లేషకులు
- ఇంకా సంక్షేమం, పాలన గురించి మాట్లాడటం విడ్డూరం
కేంద్రంలో మోడీ సర్కార్కు రెండుమార్లు అధికారం దక్కింది. ఈఏడాది మే 26తో ప్రధానిగా నరేంద్రమోడీ 8ఏండ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్...ఆ తర్వాత తన పాలనతో జనానికి చుక్కలు చూపెడుతోంది. ఇప్పటికీ ప్రజా సంక్షేమం, పాలన గురించి పెద్ద పెద్ద మాటలతో రోజులు గడుపుతోంది. నిరుద్యోగం, అధిక ధరలు, ఉపాధి సమస్యలతో దేశం సతమతమవుతోంది. ప్రజల్లో అసంతృప్తి పతాకస్థాయికి చేరుకుంది. వీటిని పరిష్కరించే సత్తాలేక, ఆలోచన చేయలేక..బీజేపీ నాయకులు వివిధ రాష్ట్రాల్లో మత భావోద్వేగాల్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నారు.
న్యూఢిల్లీ : ఈఏడాది డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అక్కడ బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. ప్రధాని మోడీ స్వంత రాష్ట్రంలో ఎన్నికలు..ఇప్పుడు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బలహీనతపైన్నే ప్రధాని మోడీ, అమిత్ షా ద్వయం ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. జైపూర్లో మే 19-20 రెండు రోజులపాటు బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ప్రధాని మోడీ పాలనపై పొగడ్తల వర్షం కురిపించడానికే ఆఫీస్ బేరర్లు పరిమితమయ్యారు. కేంద్ర పథకాలతో ప్రజలకు సాధికారత వచ్చిందన్న విషయం బాగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రులంతా దేశం నలుమూలలకు వెళ్లి మోడీ సర్కార్ ఘనతను చాటాలని బీజేపీ అధినాయకత్వం ఆదేశించింది. కేంద్ర పథకంతో లబ్దిపొందిన ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి, వారి కుటుంబంతో కొంతసేపు గడపాలని కేంద్రమంత్రులకు సూచించారు.
ఏమున్నది చెప్పుకోవడానికి..
కేంద్రంలో 10లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నా మోడీ సర్కార్ భర్తీ చేయటం లేదు. ఇది పక్కకు పెట్టి, ఉపాధి కల్పన మెరుగుపడుతుందని కార్పొరేట్ వర్గాలుకు భారీ ఎత్తున పన్ను ప్రయోజనాలు, మినహాయింపులు ఇచ్చింది. అయినా ప్రయివేటు రంగంలో ఉపాధి కల్పన దారుణంగా పడిపోయింది. కేంద్రం నుంచి పొందిన పన్ను ప్రయోజనాలు, మినహాయింపులతో బడా కార్పొరేట్ సంస్థలు వేల కోట్ల లాభాలు మూటగట్టుకున్నాయి. మోడీ సర్కార్ ఎంచుకున్న తప్పుడు ఆర్థిక విధానానికి ప్రత్యక్ష ఉదాహరణ. కార్మిక హక్కుల్ని కాలరాస్తూ చట్టాల్ని మార్చింది. లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. దాంతో ప్రయివేటు రంగంలో యాజమాన్యాలు ఇష్టమున్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోవడానికి, ఆదాయం పడిపోవడానికి లేబర్ కోడ్లే కారణం. కార్మికులకు స్థిరమైన ఆదాయం లేక..కొనుగోలు శక్తి కోల్పోయారు. ఇదంతా ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపుతోంది. దేశీయంగా బహిరంగ మార్కెట్లో గోధుమ ధర పెరుగుతుంటే..కేంద్రం గోధుమ ఎగుమతులకు అనుమతులు ఇచ్చింది. ఇలాంటి చెత్త, పనికిరాని నిర్ణయాలు కేంద్రం ఎన్నో తీసుకుంది. బీజేపీ అధినాయకుల దృష్టిలో ఇదంతా 'మంచి పాలన' (సుహాసన్)గా కనపడటం పెద్ద జోక్! అధిక ధరలు, నిరుద్యోగం దేశాన్ని చుట్టుముట్టాయి. పేద కుటుంబాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. మరోవైపు ద్రవ్యోల్బణం 15శాతం దాటింది. దాంతో ప్రజల చేతులో ఉన్న కొద్ది పాటి నగదుతో ఏది కొనలేని పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే బీజేపీ నాయకులు 'సుహాసన్' (మంచి పాలన) అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తారట.
ఎన్నికల వ్యూహాలు..
సేవా, సుహాసన్ (మంచి పాలన), గరీబ్కల్యాణ్ (పేదల సంక్షేమం)..నినాదంతో బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. మోడీ సర్కార్ 8ఏండ్ల పాలనపై వేడుకలు జరపాలని బీజేపీ అధినాయకత్వం తమ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. మే 26న ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో వ్యూహాత్మక చర్చలు సాగాయి. జూన్ 15 వరకు ప్రతి ఒక్క బీజేపీ ఎంపీ..తన నియోజికవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించబోతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు అని..రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల వ్యూహాన్ని అమలుజేయటంపై ప్రధాని మోడీ, అమిత్ షా సహా అధికార బీజేపీ నాయకులంతా బిజీ బిజీగా గడుపుతున్నారని, ప్రజా సమస్యలు పరిష్కరించే ఆసక్తి వారికి లేదని విశ్లేషకులు విమర్శించారు.
ఉచిత రేషన్ ఏమూలకు
లాక్డౌన్ కారణంగా ఎన్నో కోట్లమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. జీవనోపాధి గల్లంతైంది. మూడు నెలలకుపైగా ఏకపక్షంగా విధించిన లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. చిన్న చిన్న వ్యాపారాలు, సంస్థలు మూతపడ్డాయి. అవి ఇప్పటికీ పూర్తిస్థాయిలో తేరుకోలేదు. ఏ ఒక్క కేంద్ర పథకం ప్రజలకు అక్కరకు రాలేదు.
కేవలం 5 కిలోల గోధమ లేదా బియ్యం మంజూరు చేసి కేంద్రం చేతులుకు దులుపుకుంది. మరోవైపు సబ్సిడీ సిలిండర్ ధరను రూ.550 నుంచి భారీగా పెంచి..రూ.1052కు చేర్చింది. సబ్సిడీకి ఎగనామం పెట్టింది. పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీగా పెంచుతూ..పన్ను ఆదాయంతో కేంద్ర ఖజానా నిండింది, జనాల జేబులు గుల్లయ్యాయి. ఇదంతా మోడీ సర్కార్ 8ఏండ్ల పాలనా ఫలితం.