Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో పెరిగిన నకిలీ నోట్లు: ఆర్బీఐ
- మోడీ సర్కారుపై ప్రతిపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్ల రద్దు అనే మోడీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెట్టింది. సామాన్య ప్రజలు నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు భారీ క్యూ లైన్లలో నిలబడి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనేక మంది ప్రాణాలనూ కోల్పోయారు. అయితే, ఈ చర్యతో మోడీ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు ఏ ఒక్కటీ నిజం కాలేకపోయాయి. నోట్ల రద్దుతో నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయొచ్చు అని తెలిపిన మోడీ సర్కారు మాటలు సత్య దూరం అని తేలిపోయింది. ఇందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఇందుకు నిదర్శనం. భారత్లో నకిలీ నోట్లు పెరిగిపోయాయన్న ఆర్బీఐ నివేదిక ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కారును ఆత్మరక్షణలో పడేసింది. ఇటు ప్రతిపక్షాలు ఆర్బీఐ నివేదికను చూపుతూ కేంద్రం వైఫల్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2021-22లో అన్ని డినామినేషన్ల నకిలీ నోట్లు పెరిగాయి. ముఖ్యంగా, రూ. 500 నకిలీ నోట్లు 101.9 శాతం, రూ. 2000 ఫేక్ నోట్లు 54.16 శాతం అధికమయ్యాయి. రూ. 50, రూ. 100నోట్లు తప్ప మిగిలిన అన్ని నోట్లకు నకిలీ బెడద తాకింది. నగదు చలామణి కూడా గత మూడేండ్లలో 28.28 శాతం పెరిగింది. అన్ని డినామినేషన్లు కలిపి 2020లో రూ. 24,20,975 కోట్ల విలువైన బ్యాంకు నోట్లు చలామణిలో ఉన్నాయి. 2021లో ఇది రూ. 28,26,863 కోట్లకు చేరింది. 2022 నాటికి రూ. 31,05,721కి పెరిగింది. చలామణిలో ఉన్న కరెన్సీలో రూ. 2000 నోట్ల వాటా 1.6 శాతానికి పరిమితం కావటం గమనార్హం. 2016లో అప్పటి కేంద్రం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన విషయం విదితమే. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించటం, అవినీతిని అరికట్టడం, నకిలీ నోట్లను నివారించటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మోడీ సర్కారు అప్పట్లో తెలిపింది. అయితే, తాజా గణాంకాల ప్రకారం ఆ లక్ష్యాలు నెరవేరలేదని ప్రతి పక్షాలు కేంద్రంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి జారుకోవడం తప్ప ఎలాంటి ప్రయోజ నాన్నీ చేకూర్చలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నోట్ల రద్దు ప్రతిఫలం ఎలాగైనా దక్కిందని శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతురుర్వేది మోడీ సర్కారుపై వ్యంగ్యా స్త్రాలు సంధించారు. నకిలీ నోట్ల సమస్య తీరిపోతుందని ఎలా హామీనిచ్చారని మోడీని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్ ప్రశ్నించారు.