Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం
- 30న ప్రారంభించనున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ప్రయోజనాలను ప్రధాని మోడీ మే 30న వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన పాస్బుక్ తో పాటు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డును కూడా ఇవ్వనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దేశంలో కరోనా విజృంభణ మొదలైన మార్చి 2020 నుంచి 28 ఫిబ్రవరి 2022 మధ్యకాలంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత పిల్లలను ఆదుకునేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని 29 మే 2021న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సమగ్ర రక్షణలో భాగంగా బాధిత పిల్లలకు వసతి కల్పించడం, విద్యా, స్కాలర్ షిప్స్ అందించి వారికి మద్దతుగా నిలవడం, ఉన్నత చదువుల్లోనూ సహాయం చేయడం, 23ఏండ్ల వయసు వచ్చేనాటికి ఆర్థికంగా స్వయం సమృద్ధి చెందేలా రూ.10లక్షల సహాయం అందించడంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడం వంటి ప్రయోజనాలను ఈ పథకం ద్వారా అందించనున్నారు. ఇందులో నమోదు కోసం పీఎం కేర్స్ ఆఫ్ చిల్డ్రన్. ఇన్ పేరుతో ప్రత్యేక పోర్టల్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో ఆమోదం తెలిపిన వారికి ఈ పథకం ప్రయోజనాలను మే 30న బాధిత పిల్లలకు అందించే కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.