Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీ కార్మికుల అంశంపై ఐఎల్‌ఓకు సీఐటీయూ ఫిర్యాదు
న్యూఢిల్లీ : గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు తొలగించినందుకు సీఐటీయూ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ)ను ఆశ్రయించింది. సమ్మె చేస్తున్నవారిలో 975 మంది కార్మికులను హర్యానా ప్రభుత్వం, 991 మందిని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే తొలగించింది. కేంద్రం ప్రోద్బలంతోనే తొలగింపులు జరిగాయని ఐఎల్ఓ బ్యూరో ఫర్ వర్కర్స్ యాక్టివిటీస్ (ఏసీటీఆర్ఏవీ) డైరెక్టర్ మరియా హెలెనా ఆండ్రీకి చేసిన ఫిర్యాదులో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ పేర్కొన్నారు. ఐఎల్ఓ సమావేశాలు, సిఫారసులు, డిక్లరేషన్లలో పొందుపరిచిన విధంగా కార్మికుల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అనేక ప్రధానాంశాలను తొలగింపులు తీవ్రంగా ఉల్లంఘించాయని వివరించారు. '' సహజ న్యాయ సూత్రాన్ని పాటించకుండా కార్మికులను తొలగించారు. నెలల తరబడి జీతాలు చెల్లించకుండా కార్మికులను పేదరికంలోకి నెట్టారు'' అని తపన్‌సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎల్ఓ భారత ప్రభుత్వాన్ని సంప్రదించి అన్ని చట్ట విరుద్ధ చర్యలను ఉపసంహరించేలా పట్టుబట్టాలన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలనూ ఆదేశించాలని కోరారు. కాగా, అంగన్వాడీ కార్యకర్తల తొలగింపుపై మాట్లాడటానికి నిరాకరించిన ఢిల్లీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్.. ఇది న్యాయస్థానం పరిధిలో ఉన్నదని చెప్పారు.
ఢిల్లీ ప్రభుత్వం ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ఎస్మా) విధించిందనీ, అయితే, ఆరోగ్య సంరక్షణ, పోషకాహార సప్లిమెంట్లు ఈ చట్టంలో లేదా దాని షెడ్యూల్లో లేవని తపన్‌సేన్ అన్నారు. తమ వేతనాలు, మనుగడ కోసం తమ డిమాండ్లపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై ఎస్మా ప్రయోగించిన ఢిల్లీ ప్రభుత్వ చర్య అసమంజసమని తెలిపారు. హర్యానా ప్రభుత్వం తొలగించిన అంగన్వాడీ కార్యకర్తలు ట్రేడ్ యూనియన్ నాయకులు అని తపన్ సేన్ చెప్పారు.