Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యంత ప్రమాదకరస్థితిలో దేశం..
- దేశ సంపదన కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు అప్పగింత..
- ఏఐఏడబ్ల్యూయూ జాతీయ సమావేశాల్లో బి.వి రాఘవులు పిలుపు
న్యూఢిల్లీ : దేశ ప్రజల ఐక్యతకు ప్రమాదకరంగా మారిన బీజేపీ విధానాలను ఓడించడానికి ఆర్థిక, సామాజిక పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపు ఇచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశాన్ని అత్యంత ప్రమాదకర స్థితిలోకి నెట్టిందని విమర్శించారు. తిరువనంతపురంలోని ఈఎంఎస్ అకాడమీలో ఈనెల 28 నుంచి 31 వరకు జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాల్లో ఆదివారం బి.వి రాఘవులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలను వేగవంతం చేసిందని, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కారుచౌకగా దోచిపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాల దుష్ప్రభావాలు ప్రజల మీద విపరీతంగా పడ్డాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు హిందూత్వ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రజలపై హిందూత్వాన్ని బలవంతంగా రుద్ది సమాజాన్ని మతం, కులం పేరు విభజించే విధానాలను బీజేపీ అనుసరిస్తున్నదని విమర్శించారు. ఈ పరిస్థితిల్లో దేశంలో ఉన్న వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలు ఓడించేందుకు గ్రామీణ సామాజిక తరగతులను ఐక్యం చేసి సంఘటిత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్సమస్యలను ప్రభుత్వ రంగ సంస్థలను, లక్షల కోట్ల ప్రజా సంపదను, జాతీయ వనరులను అంబానీ, అదానీలకు అడ్డగోలుగా కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు దేశంలో ఉపాధి కోల్పోయి, కొనుగోలు శక్తి పడిపోయి నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చిందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటాయని, ఫలితంగా సామాన్యుల జీవనం అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నిత్యం పెరిగేందుకు మోడీ అనుసరిస్తున్న విధానాలే కారణమని ఆయన అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలహీనపరిచి సామాన్యులకు ఆహార ధాన్యాలను అందకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలకు భూమి, ఉపాధి, కనీస వేతనాలు, ఇళ్లు, విద్య, వైద్యం, సామాజిక సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రజలను ఏకం చేసి సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
వైవిధ్యభరితమైన భారత దేశాన్ని సమైక్యంగా ఉంచడంలో రాజ్యాంగంలోని సెక్యులరిజం అత్యంత ముఖ్య పాత్ర పోషించిందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, సెక్యులరిజం స్ఫూర్తిని తుంగలో తొక్కిందని, దేశాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీలు హిందూత్వ మనుధర్మం వైపు తీసుకుపోతున్నాయని విమర్శించారు. ఇటీవల కాలంలో వారణాసి, మధుర, ఆగ్రాలో జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, దేశ సమగ్రతకు సవాలుగా మారుతున్నాయని అన్నారు. ప్రార్థనా మందిరాలకు సంబంధించి 1991లో పార్లమెంట్ చేసిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, అప్పుడే దేశంలో అభివృద్ధి, ప్రశాంతత, ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందని అన్నారు. కార్పొరేట్లను, హిందూత్వ శక్తులను ఓడించాలంటే ఆర్థిక, సామాజిక,సాంస్కృతిక పోరాటాలను సమ్మిళితం చేసి సమరశీల పోరాటాలు చేయాలన్నారు. స్థానిక సమస్యలను, ప్రజల నిత్య జీవిత సమస్యలను సమగ్రంగా పరిశీలించి పరిష్కారమయ్యే వరకు పోరాటాలు కొనసాగించాలన్నారు. ఈ సమావేశాల్లో ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 52 మంది ప్రతినిధులు హాజరయ్యారు.