Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి మూడు ర్యాంకులూ వారివే
- ఆలిండియా టాపర్‌గా జేఎన్‌యూ మాజీ విద్యార్థి శృతి శర్మ
- అంకితా అగర్వాల్‌కు రెండు, గామిని సింగ్లాకు మూడో ర్యాంకు
- సత్తాచాటిన తెలుగు విద్యార్థులు
- ఏపీ వాసి యశ్వంత్ కుమార్‌రెడ్డికి 15వ ర్యాంకు
- హైదరాబాద్‌కు చెందిన కిరణ్మయికి 56వ ర్యాంకు
- సివిల్స్-2021 ఫలితాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్/న్యూఢిల్లీ
సివిల్స్ సర్వీసెస్ పరీక్షలో అమ్మాయిలు మెరిశారు. మొదటి మూడు ర్యాంకుల్లో అమ్మాయిలే నిలిచారు. 2021 సివిల్స్ ఫలితాల్లో జేఎన్‌యూ మాజీ విద్యార్థిని శృతి శర్మ టాపర్‌గా నిలిచారు. రెండో ర్యాంకును అంకితా అగర్వాల్, మూడో ర్యాంకును గామిని సింగ్లా సాధించారు. సివిల్స్-2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్‌కు మొత్తం 685 మందిని ఎంపిక చేసింది. జనరల్ కోటాలో 244, ఈడబ్ల్యూఎస్ నుంచి 73, ఓబీసీ నుంచి 203, ఎస్సీ నుంచి 105, ఎస్టీ నుంచి 60 మంది చొప్పున ఎంపికయ్యారు. ఐఏఎస్ క్యాడర్‌కు 180 మంది, ఐపీఎస్ క్యాడర్‌కు 200 మంది, ఐఎఫ్ఎస్ క్యాడర్‌కు 37 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ కేటగిరీకి 242 మంది, గ్రూప్-బీ సర్వీసులకు 90 మందిని ఎంపిక చేశారు.
జేఎన్‌యూ పూర్వ విద్యార్థిని శృతి శర్మ టాపర్
సివిల్ సర్వీసెస్ ఆలిండియా టాపర్‌గా జేఎన్‌యూ పూర్వ విద్యార్థి శృతి శర్మ నిలిచారు. ఆమె గ్రాడ్యుయేషన్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీలో పూర్తి చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చేరారు. ఆమె జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారు.
సత్తా చాటిన తెలుగుతేజాలు
సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు తేజాలు సత్తా చాటారు. ఏపీలోని కర్నూల్‌కు చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్, పూసపాటి సాహిత్యకు 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్ వచ్చింది. మంత్రి మౌర్య భరద్వాజ్ (28), వి సంజన సింహా (37), రవి కుమార్ (38), కొప్పిశెట్టి కిరణ్మయి (56), శ్రీపూజ (62), పాణిగ్రహి కార్తీక్ (63), గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి (69), శైలజ (83) శివానందం (87), ఆకునూరి నరేశ్ (117), అరుగుల స్నేహ (136), గడిగె వినరు కుమార్ (151), దివ్యాన్షు శుక్లా (153), కన్నెధార మనోజ్‌కుమార్ (157), బి చైతన్య రెడ్డి (161), దొంతుల జీనత్ చంద్ర (201), అకవరం సాస్యరెడ్డి (214) ర్యాంక్‌లు సాధించారు. ఎస్. కమలేశ్వరరావు (297), విద్యామరి శ్రీధర్ (336), దిబ్బాడ ఎస్వీ అశోక్ (350), గుగులావత్ శరత్ నాయక్ (374), నల్లమోతు బాలకృష్ణ (420), ఉప్పులూరి చైతన్య (470), మన్యాల అనిరుధ్ (564), బిడ్డి అఖిల్ (566), రంజిత కుమార్ (574), పాండు విల్సన్ (602), బాణావత్ అరవింద్ (623), బచ్చు స్మరణ్‌రాజ్ (676) ర్యాంకులు సాధించారు.
భవిష్యత్తు బాగుంటుంది : సుధీర్‌కుమార్‌రెడ్డి, 69వ ర్యాంకు
మాది వ్యవసాయ కుటుంబం. ఇది నాకు నాలుగో రాస్తే ఈ ర్యాంకు వచ్చింది. ఐఏఎస్ అయితే భవిష్యత్తు బాగుంటుంది. ప్రజలకు సేవ చేసేందుకు అవకాశాలు ఎక్కువుంటాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. సివిల్స్ రాసే అభ్యర్థులకు వారి మీద వారికి ఆత్మవిశ్వాసం ఉండాలి. నమ్మకంతో చదవాలి.
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించాను : శరత్‌నాయక్, 374వ ర్యాంకు
మాది జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చర్లపల్లి గ్రామం. మా నాన్న రైతు, మా అమ్మ అంగన్వాడీ టీచర్. నేను వెటర్నరీ డాక్టర్. నేను నా తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించాను. నేను ఎనిమిదో ఉన్నపుడు ఐఏఎస్ కావాలని అనుకున్నా. నేను ఐడేండ్లు ప్రిపేర్ అయ్యాను. ప్రిలిమ్స్ కష్టమని అనిపించింది. కష్టపడి చదవడం ముఖ్యం. నాలుగేండ్ల నుంచి రోజూ ఐదు నుంచి ఆరు గంటలపాటు చదివాను. ఐఏఎస్ వస్తే చదవడం ఆపేస్తాను. రాకపోతే మళ్లీ రాస్తాను.
అమ్మకు మరింత రుణపడి ఉంటా : స్మరణ్‌రాజ్ 676వ ర్యాంకు
కాలు, చేయి పనిచేయకపోయినా సివిల్స్ పరీక్ష రాసి బచ్చు స్మరణ్‌రాజ్ 676వ ర్యాంకు సాధించారు. పక్షవాతంతో కుడి కాలు, కుడి చేయి పనిచేయడం లేదు. అయినా తన తల్లి సహకారంతో సివిల్స్ రాసి ర్యాంకు పొందడం గర్వకారణంగా ఉన్నది.
హైదరాబాద్‌కు చెందిన రమేష్‌కుమార్, నాగమణి దంపతుల కుమారుడు బచ్చు స్మరణ్‌రాజ్ ఐఐటీ మద్రాస్‌లో కెమికల్ ఇంజినీరిగ్ పూర్తి చేశారు. తండ్రి న్యాయవాది, తల్లి గృహిణి. తండ్రి సలహా మేరకు సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాడు. కోచింగ్ తీసుకున్నారు. అయితే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష సమయానికి కుడి చేయి, కుడి కాలు పనిచేయలేదు. దీంతో ఆయన తన తల్లిని స్రైబ్గా నియమించుకుని సివిల్స్‌లో ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా స్వరణ్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ జన్మనిచ్చినందుకు, జీవితాన్ని, భవిష్యత్తును ఇచ్చినందుకు తన తల్లికి మరింత రుణపడి ఉంటానని చెప్పారు. కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసంతో సివిల్స్ రాశాననీ, విజయం సాధించానని అన్నారు. తండ్రి ప్రోత్సాహం, తల్లి సహకారంతో ఈ ర్యాంకు వచ్చిందన్నారు.
డాక్టర్ నుంచి సివిల్స్‌కు : కిరణ్మయి, 56వ ర్యాంకు
మాది హైదరాబాద్. ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేశాను. డాక్టర్ నుంచి సివిల్స్ వైపు వచ్చాను. నాలుగోసారి సివిల్స్ రాసి మంచి ర్యాంకు సాధించాను. ఇప్పటి వరకు నాలుగు సార్లు సివిల్స్ రాసి మూడు సార్లు ర్యాంకు పొందాను.
సివిల్స్ ఫలితాల్లో సీఎస్బీ ప్రభంజనం
సివిల్స్ ఫలితాలు-2021లో సీఎస్బీ ప్రభంభనం సృష్టించిందని సీఎస్బీ ఐఏఎస్ అకాడమి డైరెక్టర్ బాలలత చెప్పారు. తమ సంస్థలో శిక్షణ పొందిన 14 మంది విద్యా ర్థులు సివిల్స్‌లో ర్యాంకులు సాధించారని వివరించారు. ఇది ఎంతో సంతోషం కలిగించిందన్నారు. కష్టపడి చదివితే సివిల్స్‌లో విజయం సాధించడం కష్టమేమీ కాదని మరోసారి తమ విద్యార్థులు నిరూపించారని చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
సత్తాచాటిన 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి
సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటామని 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెన్ పి కృష్ణప్రదీప్ చెప్పారు. తమ సంస్థలో శిక్షణ పొందిన ఏడు మంది విద్యార్థులు యశ్వంత్‌కుమార్‌రెడ్డి (15), మౌర్య భరద్వాజ్ (28), కిరణ్మయి కొప్పిశెట్టి (56), క్రిషన్‌లాల్ చందని (95), వి మనీషా (154), బి చైతన్యరెడ్డి (161), అశోక్ దిబ్బాడ (350) ర్యాంకులు సాధించారని అన్నారు.
అనలాగ్ ఐఏఎస్ అకాడమి విద్యార్థుల విజయం
సివిల్స్ ఫలితాల్లో అనలాగ్ ఐఏఎస్ అకాడమి విద్యార్థులు విజయం సాధించారు. శిక్షణ పొందిన విద్యార్థుల వివరాలను అకాడమి డైరెక్టర్ శ్రీకాంత్ విన్నకోట విడుదల చేశారు.
ఎంతో అనుభవం ఉన్న సిబ్బందితో శిక్షణ ఇచ్చామని వివరించారు. విద్యార్థులకు కావాల్సిన పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా నిర్ణీత పద్ధతిలో తగు శిక్షణతోపాటు వారి సాధనకు ఎంతో కృషి చేశామని చెప్పారు. తమ సహకారం, అభ్యర్థులు కష్టపడి చదవడం వల్లే ఈ ర్యాంకులు సాధించారని అన్నారు.
టాప్ టెన్ ర్యాంకర్లు
ర్యాంకు పేరు
1 శృతిశర్మ
2 అంకితా అగర్వాల్
3 గామిని సింగ్లా
4 ఐశ్వర్య వర్మ
5 ఉత్కర్ష్ ద్వివేది
6 యక్ష్ చౌదరి
7 సమ్యక్ ఎస్ జైన్
8 ఇషితా రాతి
9 ప్రీతమ్ కుమార్
10 హర్కీరత్ సింగ్ రంధవా