Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగుమతులకు ఏర్పాట్లు చేశామని రాష్ట్రాలకు కేంద్రం లేఖ
- కొనక తప్పని పరిస్థితుల్లో రాష్ట్రాలు!
- విద్యుత్ అవసరాలు తీరాలంటే అదనంగా చెల్లించాలి : నిపుణులు
న్యూఢిల్లీ : బొగ్గు కొరతపై కేంద్రం అనాలోచిత నిర్ణయాలు, అసమర్థత...రాష్ట్రాల మెడకు చుట్టుకుంది. చివరికి బొగ్గు సంక్షోభంలో రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాలకు రాసిన మే 28నాటి లేఖలో..అంతర్జాతీయ మార్కెట్ నుంచి రాష్ట్రాలు బొగ్గు కొనుగోలు చేయకతప్పదని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు 'కోల్ ఇండియా లిమిటెడ్' బొగ్గును దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బొగ్గు తవ్వకాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా పేరొందిన 'కోల్ ఇండియా', 2015 తర్వాత బొగ్గు దిగుమతి చేసుకోవటం ఇదే మొదటిసారి..అని నిపుణులు చెబుతున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బొగ్గు దిగుమతి చేసుకోవటం గందరగోళంగా తయారవుతుందని తొలుత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశీయ బొగ్గు ధరలోనే దిగుమతి చేసిన బొగ్గును సరఫరా చేయాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. దీనిపై కేంద్రం నుంచి స్పష్టత రాలేదు. బొగ్గు కొరతను ఎదుర్కోవటంలో మోడీ సర్కార్ ఎంచుకున్న విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యను రాష్ట్రాల మెడకు చుట్టడాన్ని విద్యుత్ రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. దేశీయ బొగ్గు ధరతో పోల్చుకుంటే, దిగుమతి చేసుకున్న బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చాలా ఖరీదుగా మారుతుందని, ఉదాహరణకు మధ్యప్రదేశ్ విద్యుత్ అవసరాల ప్రకారం..ఆ రాష్ట్ర ఖజానా నుంచి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెప్పారు. అంతేగాక విద్యుత్ ఉత్పత్తిలో ప్రతి యూనిట్‌కు ఒక రూపాయి అదనంగా ఖర్చు అవుతుందన్నారు.
ఇదిలా ఉండగా సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ, క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) తాజాగా ఒక కీలక విషయం వెల్లడించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ సీజన్ మొదలుకానున్నది. విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతోంది. దీనికి తగ్గట్టు విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేసే పరిస్థితి లేదు. విద్యుత్ గృహ వినియోగం, వ్యవసాయ వినియోగం రెండూ ఎక్కువగా ఉండే జులై-సెప్టెంబర్‌లో దేశంలో బొగ్గు సంక్షోభం తలెత్తుతుందని సీఆర్ఈఏ అంచనావేసింది. అలాగే వర్షాలు, రుతు పవనాల రాక కారణంగా బొగ్గు గనుల్లో తవ్వకాలు ఆగిపోతాయని తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ముందస్తు ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నది.
నిల్వలు ఎంతున్నాయి?
సెంట్రల్ ఎలక్ట్రసిటీ అథారిటీ విడుదల చేసిన సమాచారం ప్రకారం, మే 26నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 173 విద్యుత్ ప్లాంట్ల వద్ద 2.11కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. 6.64కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాల్సిన చోట అందులో 33శాతం మాత్రమే అందుబాటులో ఉంది. దేశీయ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి సాగిస్తున్న 82ప్లాంట్లు, విదేశీ బొగ్గుతో విద్యుత్ తయారీచేసే 10ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు అడుగంటాయి.