Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ సీఎం వెల్లడి
చండీగఢ్ : పంజాబీ సింగర్, కాంగ్రెస్ నాయకుడు సిద్దూ మూస్వాలా హత్యపై జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటన చేశారు. ఈ కమిషన్‌కు సిట్టింగ్ హైకోర్టు జడ్జి నేతృత్వం వహించనున్నారు. తన కొడుకు హత్య ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని మూస్వాలా తండ్రి బాల్కౌర్ సింగ్ సీఎంను కోరిన అనంతరం భగవంత్ మాన్ ఈ కమిషన్‌ను ఏర్పాటుపై ప్రకటన చేశారు. అలాగే, ఈ దర్యాప్తులో సీబీఐ, ఎన్ఐఏను భాగస్వామ్యం చేయాలని మూస్వాలా తండ్రి డిమాండ్ చేశాడు. సిద్దూ మూస్వాలా హత్యపై సీఎం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేసును పంజాబ్ హర్యానా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పంజాబ్ ప్రభుత్వం అభ్యర్థించిందని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్యానెల్‌కు పూర్తిగా సహకరిస్తుందని వివరించారు.
న్యాయస్థానం ముందుకు నేరస్థులను తీసుకురావడానికి తాము ఏ ఒక్క ప్రయత్నాన్నీ ఒదులుకోబోమని తెలిపారు. కాగా, పంజాబ్ పోలీసులు మూడు రోజుల క్రితం సిద్దూ మూస్వాలాతో పాటు 424 మందికి భద్రతను తాత్కాలికంగా తొలగించడం లేదా తగ్గించటం చేశారు. ఈ విషయంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. వాటిపై సీఎం స్పందించారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఇప్పటికే ఆదేశించామని ఆయన అన్నారు. కొందరు గుర్తు తెలియని దుండగులు మూస్వాలాను ఆదివారం మన్సా జిల్లాలో కాల్చి చంపిన విషయం విదితమే. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దూ మూస్వాలా మన్సా నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఆప్ అభ్యర్థి విజరు సింగ్లా చేతిలో ఓడిపోయారు.