Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగుళూరులో ఘటన
- ముఖంపై నల్ల సిరా జల్లిన దుండగులు
- కర్నాటక ప్రభుత్వ మద్దతుతోనే దాడి : రైతు నేత
న్యూఢిల్లీ : భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్‌కు కర్నాటకలో చేదు అనుభవం ఎదురైంది. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనపై కొందరు దుండగులు నల్ల సిరాతో దాడి చేశారు. దీంతో టికాయత్ అనుచరులు వారిపై ప్రతిదాడికి దిగారు. ఈ క్రమంలో మీడియా సమావేశం రణరంగంగా మారింది. కర్నాటకలో ఓ రైతు నాయకుడు డబ్బులు తీసుకుంటున్నట్టు ఇటీవల స్టింగ్ ఆపరేషన్ వెల్లడించింది. దీంతో టికాయత్, ఆయన అనుచరులకు వ్యతిరేకంగా కొంతకాలంగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడేందుకు టికాయత్ సోమవారం బెంగుళూరులో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. రైతు సంఘం నాయకుడు డబ్బులు తీసుకున్న దానికి తమకు సంబంధం లేదనీ, తమ వాళ్ల ప్రమేయం ఇందులో లేదని టికాయత్ మీడియా సమావేశంలో చెబుతుండగా కొంతమంది హఠాత్తుగా దాడికి తెగబడ్డారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన వద్దకు దూసుకొచ్చి... హఠాత్తుగా ముఖంపై నల్ల సిరా చల్లారు. దీంతో టికాయత్ అనుచరులు, రైతు నేతలు దాడికి తెగబడ్డ దుండగులపై ప్రతిదాడికి దిగారు. పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నారు. దీంతో మీడియా సమావేశం రసాభాసగా మారింది. ఘటన అనంతరం టికాయత్ మీడియాతో మాట్లాడుతూ, వేదిక వద్ద తనకు ఎలాంటి భద్రత కల్పించలేదని కర్నాటక ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం మద్దతుతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. రైతు నిరసనలకు చిక్కులు సృష్టించాలని కర్నాటక ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరిపిన కిసాన్ సంయుక్త మోర్చా సమన్వయ కమిటీ ఏడుగురు సభ్యుల్లో తికాయత్ ఒకరు. కాగా, తాజా పరిణామాలపై రైతు నేత అవిక్ షా మాట్లాడుతూ, సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం దేశంలోని నలుమూలలకూ వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుందని, ఉద్యమాన్ని పటిష్టం చేస్తుందని అన్నారు. త్వరలోనే ఆ పనిచేస్తామన్నారు. వారం పది రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని తెలిపారు.