Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ ఎన్నికలో కేంద్ర మంత్రి, సీనియర్లకు దక్కని చోటు
- నక్వీ, సయ్యద్ జాఫర్, ఎం.జె.అక్బర్‌లకు షాక్!
- ఇరు సభల్లో ఒక్క ముస్లిం ఎంపీ లేని పార్టీగా బీజేపీ
న్యూఢిల్లీ : ముస్లింల పట్ల వ్యతిరేకత, విద్వేషాన్ని మోడీ సర్కార్ మరోమారు చూపింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ముస్లిం అభ్యర్థులకు టికెట్ ఇవ్వని పార్టీగా బీజేపీ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పార్లమెంట్లో సైతం వారి ముఖాలు కనపడకూడదనే వైఖరి కనబర్చింది. రాజ్యసభలో బీజేపీ ముస్లిం ఎంపీలు ముక్తార్ అబ్బాస్ నక్వీ, సయ్యద్ జాఫర్ ఇస్లాం, ఎం.జె.అక్బర్‌ల పదవీ కాలం ముగియటంతో, మరో టర్మ్ అవకాశం ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. దాంతో పార్టీ నుంచి లోక్‌సభ, రాజ్యసభలో ఒక్కరంటే ఒక్క ముస్లిం ఎంపీలేని అధికార పార్టీగా బీజేపీ తీరు చర్చనీయాంశమైంది. రాజ్యసభలో ఏర్పడిన ఖాళీ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు బీజేపీ 22మందిని నామినేట్ చేయగా, అందులో ఒక్క ముస్లిం అభ్యర్థి లేరు. కేంద్ర మైనార్టీ మంత్రి నక్వీ రాజ్యసభ పదవీకాలం జూన్ 7తో ముగియనున్నది. రాంపూర్ లోక్‌సభ స్థానానికి జూన్ 23న జరిగే ఉప ఎన్నికలో నక్వీ పోటీ చేయనున్నారని సమాచారం. ఎన్నికల్లో ఓడితే మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిందే. జులై 4న సయ్యద్ జాఫర్ ఇస్లాం, జూన్ 29న ఎం.జె.అక్బర్ రాజ్యసభ పదవీ కాలం ముగియనున్నది. బీజేపీ ప్రకటించిన ప్రస్తుత జాబితాలో వీరికి చోటు దక్కలేదు. రాష్ట్రపతి నామినేటెడ్ కేటగిరి కింద 7 ఎంపీ స్థానాలు భర్తీ కానున్నాయి.ఒకవేళ అవకాశం ఇస్తే రాష్ట్రపతి నామినేటెడ్ గా ఎంపీ పదవులు వారికి దక్కాలి. లేదంటే ఇక లేదు.2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆరుగురు ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్ ఇవ్వగా,అన్ని స్థానాల్లో నూ వారు ఓడిపోయారు.లోక్ జనశక్తి పార్టీ నుంచి గెలిచిన మెహబూబ్ అలీ కైసర్ ఒక్కరే ఇప్పుడు ఎన్డీయే కూటమిలో ఏకైక ముస్లిం ఎంపీ.
పార్టీ సీనియర్ నేతలకు షాక్
రాజ్యసభ ఎంపీ పదవుల్ని ఆశిస్తున్న బీజేపీ సీనియర్ నేతలకు, కేంద్ర మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. 22 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయగా, అందులో కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అవకాశం ఇచ్చింది. మహారాష్ట్ర నుంచి పియూష్ గోయల్‌కు అవకాశం దక్కింది. జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. వీరితో పాటు సీనియర్ ఓపి మాథుర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, వినరు సహస్త్రబుద్ధే వంటి సీనియర్లకు రాజ్యసభ సీటు అవకాశం దక్కలేదు. రాజ్యసభలో బీజేపీ చీఫ్‌విప్, కేంద్ర మాజీ మంత్రి శివప్రతాప్ శుక్లాకు కూడా చోటు దక్కలేదు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాంను తొలగించారు.