Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరిలో ఏఐఏడబ్ల్యూయూ 10వ జాతీయ మహాసభ
- జనరల్ కౌన్సిల్ భేటీ
- నిత్యావసర సరుకుల పంపిణీలో కేరళ మోడల్‌ను అవలంభించాలి : బి వెంకట్
న్యూఢిల్లీ : దేశంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు నిర్వహించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) నిర్ణయించింది. అలాగే ఆ సంఘం 10 అఖిల భారత మహాసభ ఫిబ్రవరిలో పశ్చిమ బెంగాల్లో జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఏఐఏడబ్ల్యూయూ జనరల్ కౌన్సిల్ సమావేశం మే 30, 31ల్లో రెండు రోజుల పాటు కేరళలోని తిరువనంతపురంలో ఈఎంఎస్ అకాడమీలో జరిగింది. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బి.వెంకట్ మాట్లాడారు. ఆగస్టు 1న 500కి పైగా జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్ణయించిందన్నారు. దీనికి ముందు జూలై 15 నుంచి డిమాండ్లపై క్షేత్రస్థాయిల్లో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఆహార ధాన్యాల ధరల పెరుగుదల, పెరుగుతున్న సంక్షోభాలపై వివరణాత్మక చర్చ జరిగిందనీ, మన దేశం ద్రవ్యోల్బణంలో చిక్కుకుందని అన్నారు. ఫలితంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయనీ, ఈ క్రూరమైన ధరల పెరుగుదల కారణంగా గ్రామీణ, పట్టణ పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 7.8 శాతంగా ఉందని, గత ఎనిమిదేండ్లలో ఇది అత్యధికమని అన్నారు. ఆహార ధరల ద్రవ్యోల్బణం 8.38 శాతానికి ఎగబాకగా, ఏప్రిల్‌లో టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 15.08 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. గోధుమ పిండి ధరలు మే 2021లో కిలోకు రూ. 28.80 నుండి మే 2022 నాటికి రూ. 32.91కి పెరిగాయన్నారు. వంట నూనెలు లీటరుకు రూ. 200 ధర పలుకుతున్నాయని, కూరగాయల సీజనల్ ధరలు పెరిగాయని చెప్పారు. వంట గ్యాస్ ఖర్చులు ఆశ్చర్యకరంగా 76 శాతం పెరిగాయని, 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర కేవలం ఒక సంవత్సరంలో రూ. 431.50 పెరిగిందని అన్నారు. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పిల్లలకు పౌష్టికాహారాన్ని తగ్గించడం, కనీస జీవన ప్రమాణాలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయలేకపోవడం జరుగుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ దిక్కులేని విధానాలు మన దేశాన్ని ఆకలితో అలమటింప చేస్తున్నాయనీ, భారతదేశం ఆకలి సూచికలో 101వ స్థానంలో ఉందని తెలిపారు. సరైన పరిష్కారం కోసం వెతకడానికీ, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి బదులుగా నగదు బదిలీ, ఆహార కూపన్ల పేరుతో మార్కెట్-ఆధారిత ఆలోచనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తెస్తోందని విమర్శించారు. కేరళ తరహాలో ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేయాలని, బియ్యంతో పాటు పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం గోధుమల సంక్షోభం కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా బట్టబయలు చేసిందని, ప్రభుత్వ సంస్థల ద్వారా గోధుమల సేకరణ బాగా తగ్గిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 25 నుంచి 35 శాతం పేదలకు ఇళ్లు లేవని, ఇళ్లు నిర్మాణానికి కేంద్రం రూ.5 లక్షలు, రాష్ట్రం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 14న రాత్రి 'సామూహిక్ జాగరణ్' (ప్రజల జాగరణ) చేయాలని అన్నారు. ఆగస్టు 1 నుంచి 14 వరకు విస్తతమైన ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆగస్టు 9న 'క్విట్ ఇండియా డే'ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో సంయుక్త ప్రదర్శనలు నిర్వహించాలని అన్నారు. వ్యవసాయ కార్మికులను ఆదుకోవడానికి ఎల్డిఎఫ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా సమావేశం ప్రశంసించిందని అన్నారు. వివిధ మార్గాల ద్వారా కేరళ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం సహాయంతో బిజెపి చేస్తున్న ప్రయత్నాలను ఖండించిందని అన్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ ఎజెండాకు తమ సంఘం మద్దతు ఇస్తుందని, ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష యుడిఎఫ్, ఆర్ఎస్ఎస్, బిజెపి చేస్తున్న ప్రచారాన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చిందని అన్నారు. విలేకరుల సమావేశంలో ఎఐఎడబ్ల్యుయు సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, జాతీయ కమిటీ సభ్యులు ఎన్. చంద్రన్, అనవూర్ నాగప్పన్, నారా ఐలయ్య ఉన్నారు.