Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ పదవులకు రాజీనామా
న్యూఢిల్లీ : విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా కర్నాటకలో మేథావులు, కవులు, రచయితలు, విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పదవులకు రాజీనామా చేసి..నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పాఠ్యపుస్తకాల్లోని స్వతంత్ర పోరాట గాథల్ని, జీవిత చరిత్రలను, అభ్యుదయ రచనల్ని పాఠ్యాంశాలుగా బీజేపీ సర్కార్ తొలగించింది. వీటి స్థానాల్లో హిందూ భావజాలాన్ని పెంపొందించే వాటిని చేర్చుతోంది. సోషల్ సైన్స్, కన్నడ భాషా పాఠ్యపుస్తకాల్లో చేసిన మార్పులు వివాదాస్పదమయ్యాయి. భారత స్వాతంత్ర సంగ్రామంలో తన ప్రాణాల్ని లెక్కచేయకుండా పోరాడిన భగత్‌సింగ్ గురించి తెలిపే పాఠ్యాంశాల్ని తొలగించారు. మైసూర్ పాలకుడు టిప్పుసుల్తాన్, సంఘసంస్కర్త బసవన్న, ద్రవిడ ఉద్యమ నాయకుడు పెరియార్, సంస్కరణవాది నారాయణ గురు...మొదలైనవారి గురించిన పాఠాల్ని సిలబస్ నుంచి బీజేపీ సర్కార్ తొలగించింది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్‌పై పదో తరగతిలో పాఠ్యాంశంగా చేర్చారు. 2020లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన పాఠ్యపుస్తకాల రివిజన్ కమిటీ ఈ ప్రతిపాదనలు చేసింది.పాఠ్యాంశాల కాషాయీకరణ కన్నడనాట చర్చనీయాంశమైంది. పలువురు మేథావులు, విద్యావేత్తలు, రచయితలు, కవులు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అయినప్పటికీ బీజేపీ సర్కార్ విధానంలో మార్పు రాకపోయేసరికి, ప్రభుత్వ పదవుల నుంచి తప్పుకుంటున్నామని తాజాగా వారు ప్రకటించారు. రాష్ట్ర కవి శివరుద్రప్ప ప్రతిష్టాన అధ్యక్ష పదవికి రచయితలు ఎస్.జి.సిద్ధరామయ్య, హెచ్.ఎస్.రాఘవేంద్రరావు, నటరాజ బుడాలు, చంద్రశేఖర నంగ్లీ తదితరులు తమ తమ పదవులకు రాజీనామా చేశారు.